కేసీఆర్‌ కు మ‌రో షాక్‌!.. ఈ సారి ఈసీ నోటీస్‌!

Update: 2019-03-29 04:22 GMT
ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించి వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం కూడా తెలంగాణ‌లో అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన గులాబీ పార్టీ టీఆర్ ఎస్‌ కు ఇప్పుడు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ హైకోర్టు నుంచి ఓ నోటీస్ అందుకున్న టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు.. ఈ సారి ఎన్నిక‌ల సంఘం నుంచి తాఖీదు అందుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ నుంచి రెండో ద‌ఫా బ‌రిలోకి దిగిన కేసీఆర్‌... త‌న అఫిడ‌విట్ లో కేసుల గురించి స‌మ‌గ్ర వివ‌రాలు అంద‌జేయ‌లేద‌ని ఓ వ్య‌క్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇటీవ‌లే హైకోర్టు కేసీఆర్‌ కు నోటీసు జారీ చేసింది. అస‌లే లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన నేప‌థ్యంలో కేసీఆర్‌ కు నోటీసు అన‌గానే టీఆర్ ఎస్ షేకైపోయింది.

తాజాగా నేరుగా ఎన్నిక‌ల సంఘం నుంచే ఈ ద‌ఫా నోటీసు రావ‌డంతో ఆ పార్టీ మ‌రింత ఇబ్బందిని ఎదుర్కోక త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈసీ నుంచి అందిన నోటీసు నేప‌థ్యంలో ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయిన త‌ర్వాత తొలి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేసీఆర్‌... సెక్ర‌టేరియ‌ట్ ఉన్నా... ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరిట సీఎంకు అధికార నివాసాన్ని కొత్త‌గా క‌ట్టారు. అప్ప‌టినుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గానే పాల‌న సాగిస్తున్న కేసీఆర్‌... టీఆర్ ఎస్‌ కు సంబంధించిన రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌కు కూడా ప్ర‌గ‌తి భ‌వ‌న్ నే కేంద్రంగా చేసుకున్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే దాదాపుగా అన్ని పార్టీలు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తుండ‌గా... తాజాగా కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించింది. సీఎం అధికార నివాసాన్నిరాజ‌కీయ కార్య‌క‌లాపాల‌కు ఎలా వాడ‌తారంటూ ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదును బేస్ చేసుకున్నఎన్నిక‌ల రాష్ట్ర ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్ చాలా వేగంగానే స్పందించారు. సీఎం అధికారిక నివాసంలో రాజ‌కీయ కార్య‌క‌లాపాలు ఎలా సాగిస్తారంటూ ఆయ‌న టీఆర్ ఎస్‌ కు నోటీసు జారీ చేశారు. అంతేకాకుండా ఈ విష‌యంలో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కూడా ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. ఈ విష‌యంపై ఇప్పుడు తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది. స‌రిగ్గా లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ కు స‌మ‌యం ఆస‌న్న‌మైన వేళ... ఇలా దెబ్బ మీద దెబ్బ ప‌డితే పార్టీ ప‌రువేం కావాల‌ని గులాబీ నేత‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసీ జారీ చేసిన నోటీసుల‌కు ఎలాంటి స‌మాధానం ఇవ్వాల‌ని కూడా టీఆర్ ఎస్ శ్రేణులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయట‌.

Tags:    

Similar News