తెలంగాణ ఈసీ లెక్కలు మామూలుగా లేవుగా?

Update: 2019-04-14 11:13 GMT
ఇప్పుడంతా డిజిటల్. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను గంటల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించటం.. వాటిని కలిపి ఇంత పోలింగ్ జరిగిందని చెప్పటం కొత్తగా చేస్తున్నది లేదు. ఎప్పటినుంచో చేస్తున్న పనే. మరేమైందో కానీ.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ పోలింగ్ అయిపోయిన వెంటనే చెప్పే పోలింగ్ లెక్కలకు.. రోజు తర్వాత సవరించిన లెక్కల్ని విడుదల చేసే అంకెలకు ఏ మాత్రం లంకె కుదరకపోవటం ఇప్పుడు వివాదంగా మారింది.

తెలంగాణలో మూడున్నర నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్ని కాసేపు వదిలేద్దాం. నాలుగు రోజుల క్రితం.. గురువారం జరిగిన ఎన్నికల లెక్కల్లోకే వెళదాం. అది కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టేద్దాం. హైదరాబాద్ మహానగరం పరిధిలోని హైదరాబాద్.. సికింద్రాబాద్.. మల్కాజిగిరి ఎంపీ స్థానాల్లో పోల్ అయిన ఓట్ల లెక్కల్లోకి వెళితే దిమ్మ తిరిగిపోవటం ఖాయం.

ఎందుకంటే.. గురువారం ఎన్నికలు ముగిసిన వెంటనే 39 శాతం ఓట్లు పోలైనట్లుగా ఈసీ లెక్కలు చెబుతూ నివేదిక విడుదల చేసింది. తర్వాతి రోజు 46 శాతం నమోదైందని చెప్పటం పలు అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు 39 శాతం నమోదైందని.. ఐదు గంటలకు పోలింగ్ స్టేషన్ల గేట్లు మూసేసినట్లుగా అధికారులు చెప్పాలి. ఈ కాస్త సమయంలోనే ఏడు శాతం పోలింగ్ జరగటం సాధ్యమా? అన్నది ప్రశ్న. అదే సమయంలో హైదరాబాద్ లోని మూడు ఎంపీ స్థానాలకు జరిగిన పోలింగ్ స్టేషన్లు ఖాళీగా దర్శనం ఇవ్వటం.. జనాలు లేని నేపథ్యంలో.. చివరి అరగంటలో 6శాతం ఓట్లు నమోదు కావటం ఏమిటన్న సందేహాలు రావటం ఖాయం.

దీనిపై సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పోలింగ్ పెరుగుదలపై తనకు అనుమానాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దాని లెక్క తేల్చేందుకు బూత్ ల వారీగా వివరాలు సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒక్క సికింద్రాబాద్ లోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఇలాంటి పరిస్థితే నెలకొంది.

నల్గొండ ఎంపీ స్థానం పరిధిలో 15.85 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గురువారం సాయంత్రం 66.11 శాతంగా చెప్పి.. ఫైనల్ గా 74.11 శాతం ఓట్లు పోలైనట్లు లెక్క తేల్చారు. అంటే.. గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత ఏకంగా 8 శాతం ఓట్లు పెరగటమా? అన్నది ప్రశ్న. అంటే.. చివర్లో 1.26లక్షల ఓట్లు పడటం సాధ్యమేనా?

మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో 14.23 లక్షల ఓట్లు ఉన్నాయి. గురువారం సాయంత్రం వరకూ 59.90 శాతం పోలింగ్ జరిగినట్లుగా వెల్లడించారు. కానీ.. ఫైనల్ గా మాత్రం 68.79 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ప్రకటించారు. చివర్లో 8.89 శాతం పోలింగ్ పెరగటం.. 1.26లక్షల ఓట్లు చివర్లో పడటం ఏమిటో? ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. ఓపక్క పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు లేరని చెబుతూనే.. చివర్లో ఇంత భారీగా ఓట్లు పోల్ కావటం ఎలా సాధ్యం?  ఒకవేళ.. అంత ఎక్కువగా ఓటర్లు వస్తే.. పోలింగ్ కేంద్రాలన్నీ కళకళలాడిపోవాలిగా?  అలాంటిదేమీ జరగకుండా ఫైనల్ లెక్కలు ఇంతలా మారిపోవటం వెనుక మర్మం ఏమిటి?
Tags:    

Similar News