ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై 'ఈసీ' మాట ఇది!

Update: 2018-09-04 16:26 GMT
తెలంగాణ‌లో ముంద‌స్తు వ‌స్తే ఏం జ‌రుగుతుంది?  ఎన్నిక‌ల సంఘం ఎలా రియాక్ట్ అవుతుంది?  తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి అసెంబ్లీని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంటే ఏం జ‌రుగుతుంది. ఈ ప‌రిణామాల‌పై ఎన్నిక‌ల సంఘం ఎలా రియాక్ట్ అవుతుంది. ఒక‌వైపు ఓట‌ర్ల జాబితా న‌మోదు స‌వ‌ర‌ణ పూర్తి కాని వేళ‌.. ముంద‌స్తు ముంచుకొస్తే ఏం జ‌రుగుతుంది? ఇలాంటి ఎన్నో సందేహాల‌కు స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. అన్ని కాకున్నా కొన్ని అంశాల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చేలా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ర‌జ‌త్ కుమార్‌.తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న తెలంగాణ రాష్ట్రంలో ముంద‌స్తు వ‌స్తే ఏం చేస్తార‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆ విష‌యాన్ని నిర్ణ‌యిస్తుంద‌ని.. వారి నిర్ణ‌యాన్ని తాము అమ‌లు చేస్తామ‌న్నారు.

షెడ్యూల్ ప్రకారం చూస్తే జ‌న‌వ‌రి ఒక‌టి వ‌ర‌కు ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే అభ్యంత‌రాల్ని స్వీక‌రిస్తున్నారు. ఒక‌వేళ ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చిన ప‌క్షంలో.. ఉప ఎన్నిక‌ల్లో ఏ విధానాన్ని అమ‌లు చేస్తామో అదే విధానాన్ని అనుస‌రించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. సో.. ముంద‌స్తు విష‌యంలో కేసీఆర్ కానీ నిర్ణ‌యం తీసుకొని ప్ర‌క‌టిస్తే.. ఆ త‌ర్వాత జ‌ర‌గాల్సిన‌వ‌న్నీ ఒక‌టి త‌ర్వాత మరొక‌టి చొప్పున జ‌రిగిపోతాయ‌న్న మాట‌.


Tags:    

Similar News