నంద్యాల నామినేష‌న్ వివాదానికి ఈసీ చెక్!

Update: 2017-08-07 13:51 GMT
నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా  దాఖ‌లు చేసిన నామినేషన్లపై టీడీపీ - వైసీపీలు పరస్పర ఆరోప‌ణ‌లు - ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహన్ రెడ్డి - డమ్మీ అభ్యర్థిగా ఆయన కుమారుడు దాఖలు చేసిన నామిషన్ కూడా చెల్లదని వార్తలు వ‌చ్చాయి.  మ‌రోవైపు, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో నంద్యాల‌లో ఉత్కంఠభ‌రిత ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అధికార - ప్ర‌తిప‌క్ష ఫిర్యాదుల‌తో అక్క‌డ గంభీర వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే, ఈ నామినేష‌న్ ల వివాదానికి ఎన్నికల క‌మిష‌న్ తెర‌దించింది. వారి  ఫిర్యాదులను నిశితంగా పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఇద్ద‌రు స‌భ్యుల నామినేషన్లను ఆమోదించింది. శిల్పా మోహ‌న్ రెడ్డి - బ్ర‌హ్మానంద రెడ్డి దాఖ‌లు చేసిన నామినేష‌న్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టు నిర్ధారించింది. మ‌రోవైపు నామినేషన్ల పరిశీలన గడువు కూడా ముగియ‌డంతో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి - వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డిలు పోటీ ప‌డనున్నారు. ఈసీ ప్ర‌క‌ట‌న‌తో నంద్యాల‌లో  ఈరోజు ఏర్ప‌డ్డ ఉత్కంఠ ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగిన‌ట్ల‌యింది.  

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌క ముందు నుంచే నంద్యాలలో ఉప ఎన్నికల ప్ర‌చారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అధికార టీడీపీ ఏకంగా అక్క‌డ మంత్రుల‌ను - ఎమ్మ‌ల్యేల‌ను మోహ‌రించి ఎన్నిక‌ల ప్ర‌చారం చేసింది. నోటిఫికేష‌న్ విడుద‌ల‌యిన త‌ర్వాత అధికార, ప్ర‌తిప‌క్షాలు త‌మ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ నంద్యాల ప‌ర్య‌ట‌న త‌ర్వాత అక్క‌డ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ జోరుకు అడ్డుక‌ట్ట వేసేందుకు టీడీపీ ఎత్తులు వేస్తోంది. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి నామినేష‌న్ చెల్ల‌ద‌ని టీడీపీ నేత‌లు రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల‌లో స‌రికొత్త అంశాన్ని టీడీపీ నేత‌లు తెర‌పైకి తెచ్చారు. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ నిబంధనల ప్రకారం లేదని రిటర్నింగ్ అధికారికి చెప్పారు. రూల్స్ ప్రకారం జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ వాడలేదని వారు ఆరోపిస్తున్నారు. శిల్పా మోహ‌న్ రెడ్డి అఫిడవిట్‌ పై సంతకం చేసిన నోటరీ రెన్యూవల్ కాలేదని టీడీపీ నేత‌లు అభ్యంతరం చెబుతున్నారు. మ‌రోవైపు, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని వైసీపీ ఫిర్యాదు చేసింది.  ఈ నేప‌థ్యంలో ఈసీ ఇరు అభ్య‌ర్థుల నామినేష‌న్లు చెల్లుతాయ‌ని చెప్ప‌డంతో సస్పెన్స్ కు తెర‌ప‌డింది.
Tags:    

Similar News