ఉద్యోగుల తొలగింపు షూరూ.. ట్విట్టర్ డౌన్.. నెటిజన్ల ఫైర్

Update: 2022-11-04 09:36 GMT
ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతుల్లో పడ్డాక దాని రూపు రేఖలు మారిపోతున్నాయి. ట్విట్టర్ సీఈవో, సీఎఫ్ఓ సహా చాలా మంది ఉన్నతాధికారులను తొలగించిన ఎలన్ మస్క్ ఇప్పుడు ఉద్యోగులపై పడ్డారు. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలో సగం మంది ఉద్యోగులను మస్క్ తొలగించే యోచనలో ఉన్నారని.. అందుకోసం జాబితా సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ ఉద్యోగుల కోతలు శుక్రవారం నుంచే మొదలు కానున్నట్లు తాజాగా బయటపడింది.శుక్రవారం ఈ మేరకు ట్విటర్ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు సమాచారం.

ట్విటర్ ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ ఈ మెయిల్స్ లో అప్రమత్తం చేసిందని.. ఉద్యోగులు కోతలు మొదలవుతున్న దృష్ట్యా సిబ్బంది ఇంటికి వెళ్లొచ్చని.. శుక్రవారం ఆఫీసుకు రావద్దని మెయిల్ లో సూచించారు. ట్విట్టర్ ను సరైన మార్గంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిలబెట్టేందుకు ఉద్యోగుల తగ్గింపు ప్రక్రియను మొదలుపెట్టాల్సి వచ్చిందని.. ఇప్పటివరకూ అందించిన మీ విలువైన సహకారాన్ని అందించారని.. ఈ నిర్ణయం పెను ప్రభావం చూపుతుందని తెలిసినా కంపెనీని విజయవంతంగా నడిపేందుకు ఈ చర్య తప్పదంటూ ఉద్యోగులకు కంపెనీ ఈ మెయిల్ చేసింది.

ఇక విధుల నుంచి తీసేసిన ఉద్యోగులకు రెండు నెలల జీతంతోపాటు వారి ఈక్విటీలకు సమానమైన నగదును మూడు నెలల్లోగా చెల్లించనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3700 మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఎలన్ మస్క్ చేతుల్లోకి ట్విటర్ వెళ్లాక సరిగా పనిచేయడం లేదు. శుక్రవారం ట్విటర్ సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో యూజర్లు తెగ ఇబ్బంది పడ్డారు. ఉదయం 3 గంటలకు మొదలైన సర్వర్ డౌన్ 7 గంటలకు తీవ్రమైంది. మరో రెండు గంటల తర్వాత  సమస్య కొలిక్కి వచ్చింది. సరిగానే ఇప్పుడు పనిచేస్తోంది.

ట్విట్టర్ డౌన్ కాగానే నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి ఇతర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టి ఎలన్ మస్క్ వల్లే ట్విట్టర్ ఇది దాపురించిందని ఆడిపోసుకుంటున్నారు.

ఇటీవల ప్రపంచ సోషల్ మీడియాలన్నీ ఇలాగే డౌన్ అవుతున్నాయి. మొన్న వాట్సాప్, నిన్న ఇన్ స్టాగ్రామ్ ఈరోజు ట్విట్టర్ ను ఆ బాధ తప్పలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News