రివర్స్ టెండరింగ్ చూసిన ఏపీ ఇప్పుడు రివర్స్ ఫిట్ మెంట్ చూస్తోందట

Update: 2022-01-18 11:01 GMT
ఏపీలో సరికొత్త రాజకీయాల్ని చూస్తున్న ప్రజలకు.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త అనుభవాన్ని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తాము అధికారంలోకి వచ్చినంతనే.. పాత ప్రభుత్వం ఓకే చేసిన ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ చేసి.. ప్రజాధనాన్ని ఆదా చేస్తామంటూ హడావుడి చేయటం.. ఆ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. అంత హడావుడి చేసినప్పటికీ రివర్సు టెండరింగ్ తో ఒరిగినప్రయోజనం ఏమీ లేదన్న సంగతి తెలిసిందే. కొంతకాలం రివర్స్ టెండరింగ్ లో భాగంగా సాగిన రచ్చ తెలిసిందే.

తాజాగా ఏపీ వ్యాప్తంగానే కాదు.. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలోని వారు సైతం జగన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన ఐఆర్.. హెచ్ఆర్ఏకు సంబంధించిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన వేళ.. చప్పట్లుకొట్టి హడావుడి చేసిన ఉద్యోగ సంఘాల నేతలు..తాజాగా అందుకు భిన్నంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు బండిశ్రీనివాసరావు.. బొప్పరాజు వెంకటేశ్వర్లు ఫైర్ అవుతున్నారు.

 ఇక.. ప్రభుత్వం ప్రకటించిన ఐఆర్ మీద ఇప్పటికే గుర్రుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు.. జగన్ సర్కారు తాజాగా తీసుకొచ్చిన హెచ్ఆర్ఏ నిబంధన మంట పుట్టేలా ఉందని చెబుతున్నారు. ఉద్యోగులకు ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ తీసేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనల్ని తీసుకొచ్చిన వైనాన్ని తీవ్రంగా తప్పు పెడుతున్నారు. రాజధాని ప్రాంతంలో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని.. ఈ కొత్త పీఆర్సీ తమకు అవసరం లేదంటున్నారు.

ఈ జీవీలో తమకొద్దని.. వాటిని తాము తిరస్కరిస్తున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే ఇవ్వాలని.. పదేళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ తమకు అవసరం లేదన్నారు. పెన్షనర్ల హక్కుల్ని కూడా జగన్ ప్రభుత్వం పోగొట్టిందని.. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజా నిర్ణయం మీద జిల్లాల వారీగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని.. అవసరమైతే సమ్మె కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు.పాత పద్దతిలోనే పీఆర్సీఇచ్చే వరకు పోరాడతామని చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల మాటల్లో తేడాను గమనించారా? మొన్నటివరకు తమకు మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేసిన వారే.. ఇప్పుడు కొత్తది వద్దు.. పాడు వద్దు..ఇప్పటికే ఇస్తున్న పీఆర్సీని కంటిన్యూ చేస్తే అదే పది వేలు అని చెప్పటం విశేషం.

రివర్సు టెండరింగ్ లో గత ప్రభుత్వం  చేసిన దోపిడీని తేల్చింది లేదు.. తాజాగా తీసుకొచ్చిన రివర్సు పీఆర్సీలో ఉన్నది పోగొట్టుకోవటం తప్పించి.. కొత్తగా వచ్చిందేమీ లేదని వాపోతున్నారు. ఏమైనా ఇలాంటివి జగన్ సర్కరుకే సాధ్యమన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఉద్యోగ సంఘాల వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఇప్పటికే అమలవుతున్న దాన్ని కంటిన్యూ చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభూ అంటూ వేడుకునే తీరుచూస్తే.. జగన్ తెలివికి మెచ్చుకోకుండా ఉండలేం.
Tags:    

Similar News