చైనాను మ‌ళ్లీ కెలికిన అమెరికా

Update: 2017-07-07 16:28 GMT
స‌రిహ‌ద్దుల‌ను గౌర‌వించ‌క‌పోవ‌డం, అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను అడ్డ‌గోలుగా ఉల్లంఘించ‌డంలో పెట్టింది పేర‌యిన చైనాకు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. డ్రాగ‌న్ కంట్రీకి అగ్ర‌రాజ్యం అమెరికా ఘాటు స‌వాలు విసిరింది. వివాదాస్ప‌ద ద‌క్షిణ చైనా స‌ముద్రంపై అమెరికాకు చెందిన రెండు బాంబ‌ర్లు ఎగిరిన‌ట్లు యూఎస్ ఎయిర్‌ఫోర్స్ ప్ర‌క‌టించింది. గ‌త నెల‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రెండు బీ-1బీ లాన్స‌ర్ బాంబర్లు ఎగ‌ర‌డ‌మే కాదు.. అమెరికా యుద్ధ నౌక ఒక‌టి చైనా కృత్రిమ దీవికి 12 నాటిక‌ల్ మైళ్ల దూరంలో డ్రిల్ కూడా నిర్వ‌హించింది. ఈ ప్రాంతం త‌మ‌దేనని చైనా వాదిస్తున్నా.. దీన్నో అంత‌ర్జాతీయ ప్రాంతంగా అమెరికా గుర్తిస్తున్న‌ది.

జీ20 స‌ద‌స్సులో భాగంగా చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌ పింగ్‌ తో ట్రంప్ స‌మావేశానికి ముందు అమెరికా బాంబ‌ర్లు ఇలా వివాదాస్ప‌ద ప్రాంతంలో ఎగ‌ర‌డం ఆస‌క్తి రేపుతోంది. నార్త్ కొరియా మిస్సైల్స్ ప‌రీక్ష‌లు, దానిని క‌ట్ట‌డి చేయ‌డంపై ఈ స‌మావేశంలో ట్రంన్‌, జిన్‌పింగ్ చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఏటా 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల విలువైన వాణిజ్యం న‌డిచే ద‌క్షిణ చైనా స‌ముద్రంపై త‌మ‌కే పూర్తి హ‌క్కులు ఉన్న‌ట్లు చైనా వాదిస్తూ వ‌స్తోంది. దీనిపై బ్రూనై, మ‌లేషియా, ఫిలిప్పీన్స్‌, తైవాన్‌, వియత్నాం లాంటి దేశాలు అంత‌ర్జాతీయ కోర్టుకు వెళ్లినా.. కోర్టు కూడా తీర్పును చైనాకు వ్య‌తిరేకంగా ఇచ్చినా ఆ దేశం మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. సౌత్ చైనా స‌ముద్రంలో చైనా మిలిట‌రీ స్థావ‌రాల‌ను ఏర్పాటు చేయ‌డంపై అమెరికా గుర్రుగా ఉంది. ఈ క్ర‌మంలో తాజా ప‌రిణామం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News