ప్రధాని మోడీ పెళ్లి చేసి పెట్టాలట..

Update: 2017-05-07 11:14 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. క్రీడాకారులెవరైనా ఏదైనా సాధించినపుడు.. ఎవరైనా చిన్న స్థాయి వ్యక్తులు స్ఫూర్తి నింపే పనులు చేసినపుడు వాళ్ల గురించి ప్రస్తావిస్తూ అభినందనలు తెలుపుతుంటారు. గతంలో ఉన్న ప్రధానులకు.. ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని మోడీ చాలా తగ్గించారన్నది వాస్తవం. సోషల్ మీడియాలో ఎవరైనా సమస్యల్ని తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించే ప్రయత్నమూ చేస్తుంటారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ద్వారా కూడా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యల్ని స్వీకరించే ప్రత్యేక కార్యక్రమం నడుస్తోంది ఢిల్లీలో.

ఐతే ప్రజా సమస్యల కోసం పెట్టిన ఈ సెల్ కు జనాలు తమ వ్యక్తిగత సమస్యల గురించి విన్నపాలు పంపిస్తూ పీఎంఓను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ఛండీగఢ్ కు చెందిన ఓ కుర్రాడు.. తన పెళ్లికి సాయం చేయాలంటూ మోడీని అభ్యర్థించాడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఇబ్బందులు తలెత్తాయని.. ఆయన తన తల్లిదండ్రులతో.. అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి తమ పెళ్లి జరిగేలా చూడాలని అభ్యర్థించాడు. ఈ విషయాన్ని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి వ్యక్తిగత సమస్యలతో చాలామంది పీఎంఓ గ్రీవెన్స్ సెల్ కు విన్నపాలు పంపుతున్నారని.. ఇలాంటి వాటి వల్ల గ్రీవెన్స్ సెల్ లక్ష్యం దెబ్బ తింటుందని.. తమకు అందుతున్న విన్నపాల్లోంచి ఇలాంటి వాటిని వేరు చేయడం ఇబ్బందవుతోందని.. కాబట్టి ఇలాంటివి మానుకోవాలని పీఎంవో వర్గాలు కోరాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News