డెంగ్యూ దెబ్బ..12 లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణం

Update: 2019-11-17 05:53 GMT
డెంగ్యూ తెలంగాణను కబళిస్తోంది. ఎంతో మందిని చిదిమేస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి పండు ముదసలి వరకు.. ఎంతో ఉజ్వల భవిష్యత్తుతో ముందుకెళుతున్న యువత వరకూ అందరినీ మృత్యువు దగ్గరకు తీసుకెళుతోంది.

ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలు చనిపోయారంటే వారికి ఆ స్థోమత లేదు అని అనుకుంటాం.. కానీ ఉన్నత కుటుంబం.. లక్షల డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఉండి కూడా ఓ కుటుంబం ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువ ఇంజనీర్ ను కాపాడుకోలేని ధైన్యం ఉందంటే అంతకంటే విషాదం మరొకటి లేదు.

తాజాగా మెదక్ జిల్లా హవేళిఘన్ పూర్ మండలం నాగాపూర్ కు చెందిన భవ్యారెడ్డి (21) అనే బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ డెంగ్యూతో ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదం నింపింది. నర్సాపూర్ లోని బీవీఆర్టీ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈ యువతి క్యాంపస్ సెలక్షన్స్ లో ఏకంగా ప్రతిష్టాత్మక ‘ఇన్ఫోసిస్’లో ఉద్యోగం సంపాదించింది. మరో రెండు నెలల్లో పరీక్షలు పూర్తై అందులో చేరాల్సి ఉండగా మృత్యువు డెంగ్యూ రూపంలో కబళించింది.

భవ్యకు పదిరోజుల క్రితం జ్వరం రాగా ఆమె తల్లిదండ్రులు నరేందర్ రెడ్డి-మంజుల దంపతులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే జ్వరం తగ్గకపోవడం.. పరిస్థితి విషమంగా మారడంతో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్లేట్ లెట్స్ పడిపోవడం.. వెంటీలేటర్ పై చికిత్స చేసినా ఆ యువతి ప్రాణాలు దక్కలేదు. యువతి కోసం కేవలం 10 రోజుల్లోనే 12 లక్షలు ఖర్చు చేసినా తమ కూతురు ప్రాణం దక్కలేదని ఆ కుటుంబం భోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.

ఇలా డెంగ్యూ కారణంగా తెలంగాణలో మరణ మృందంగం కొనసాగుతోంది. చాలా జిల్లాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఓ చిన్న దోమ కారణంగా వ్యాపించే ఈ వ్యాధి ఇప్పుడు తెలంగాణలో మృత్యుగీతం ఆలపిస్తోంది. ఆర్టీసీ సమ్మె - ఇతర సమస్యలతో సర్కారు డెంగ్యూపై  నిర్లక్ష్యం వహిస్తూ ఎంతో మంది మరణాలకు కారణమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
    

Tags:    

Similar News