ఆధార్ ఉంటేనే కృష్ణపట్నంలోకి ఎంట్రీ .. ఎందుకంటే ?

Update: 2021-06-02 08:31 GMT
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య కరోనాకు విరుగుడుగా ఇవ్వతలపెట్టిన మందుకి తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు పదిహేను రోజుల బ్రేక్ తర్వాత ఆనందయ్య మందు పంపిణీకి జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, హైకోర్టు కూడా ఆనందయ్య మందును పంపిణీ చేయాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆనందయ్య పంపిణీ చేసే మందు కోసం ప్రజలు తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటం, అలా రావడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగే ప్రమాదం ఉండటంతో మందు పంపిణీకి జిల్లా కలెక్టర్ చక్రధర్ ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించారు.

ఆనందయ్యతో సమావేశమైన కలెక్టర్ చక్రధర్, ఆనందయ్య పంపిణీ చేసే మందును మొబైల్ యాప్ ద్వారా బాధితులకు అందించాలని నిర్ణయించారు. ఆనందయ్య మందు పంపిణీ కోసం ప్రత్యేకంగా యాప్ రూపకల్పన చేయాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. మొబైల్ యాప్ ద్వారా మందును పంపిణీ చేస్తామని, ఎవరూ కృష్ణపట్నం రావొద్దని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఆన్‌లైన్‌లో మందు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణ‌ప‌ట్నంలోకి రావాలంటే త‌ప్ప‌ని స‌రిగా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపించాలని అన్నారు. ఆనంద‌య్య మందుకోసం ఇత‌ర ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  గ్రామ‌స్తులు త‌ప్ప మ‌రెవ‌రూ గ్రామంలోకి రావడానికి వీలు లేద‌ని, ఆ గ్రామ వాస్తవ్యులు కూడా బ‌య‌ట నుంచి గ్రామంలోకి రావాలంటే ఆధార్ కార్డు త‌ప్ప‌ని స‌రి అని పోలీసులు చెప్తున్నారు. కృష్ణ‌ప‌ట్నంలో ప్ర‌స్తుతం 144 సెక్ష‌న్‌ ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.  గ్రామ‌స్తులు త‌ప్ప ఇత‌రుల‌ను గ్రామంలోకి అనుమ‌తించ‌డం లేదు.  ఇక ఆనంద‌య్య మందు త‌యారీని కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు త‌ర‌లించారు. మందు పంపిణీకి మరో నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
Tags:    

Similar News