రైతు పేరుతో పొగిడారు..అస‌లు సంగ‌తి చెప్ప‌లేదుగా!

Update: 2018-03-16 05:37 GMT
ఇవాళ వ‌చ్చిన పేప‌ర్లు చూశారా?  వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అన్ని ప‌త్రిక‌లు తాటికాయంత అక్ష‌రాల‌తో రైతుకు పండ‌గేన‌న్న‌ట్లుగా ఈటెల వారి బ‌డ్జెట్ ఉందంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఒక విధంగా కేసీఆర్ స‌ర్కారు రైతుల‌కు మేలు ఎంతో చేస్తున్న‌ట్లుగా చెప్పుకొచ్చారు. ఈటెల బ‌డ్జెట్ లో రైతుల‌కు వేసిన పెద్ద‌పీట వేసిన‌ట్లుగా పేర్కొన్న వారు.. స‌గ‌టు జీవికి అవ‌స‌ర‌మైన క‌నీస అవ‌స‌రాల విష‌యంలో చేయి చూపించిన వైనాన్ని ప్ర‌స్తావించ‌లేదు.

కేసీఆర్ స‌ర్కారుకు జ‌రిగే లాభాన్ని మాత్ర‌మే త‌మ హెడ్డింగ్ ల‌లో ప్ర‌స్తావించారే కానీ.. సగ‌టు జీవికి జ‌రిగిన న‌ష్టం గురించి మాట వ‌ర‌స‌కు ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. రైతుకు ఉగాది అని ఒక‌రు..జెండాపై రైత‌న్న అని మ‌రొక‌రు.. స‌లామ్ రైత‌న్న అని ఇంకొక‌రు.. అన్న‌దాత సుఖీభ‌వ అంటూ రైతుల‌కు జ‌రిగే మేలు గురించి హైలెట్ చేసుకొచ్చారు.

1.74ల‌క్ష‌ల కోట్ల రూపాయిల్లో స‌గ‌టుజీవి అవ‌స‌రాల కోసం కేటాయించిన నిధులు ఎంత‌?  వాడి జీవ‌న ప్ర‌మాణం పెరిగే విష‌యంలో ప్ర‌భుత్వ దృష్టి ఎంత ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. మొత్తం బ‌డ్జెట్  కేటాయింపుల్లో నాలుగో వంతు సాగు కోసం కేటాయించ‌టం బాగానే ఉంది. కానీ.. పాఠ‌శాల విద్య కోసం రూ.10వేల కోట్లు మాత్ర‌మే కేటాయించ‌టం.. ఈ కేటాయింపులో పాఠ‌శాల ఉపాధ్యాయులు.. సిబ్బంది జీతాల‌కే స‌రిపోయే తీరు చూస్తే.. పాఠ‌శాల విద్యా ప్ర‌మాణాలు పెంచే విష‌యంలో ప్ర‌భుత్వానికి ఉన్న నిర్ల‌క్ష్యం సంగ‌తేమిటో ఇట్టే అర్థ‌మైపోతుంది.

ఓటు బ్యాంకు రాజ‌కీయమే త‌మ లక్ష్య‌మ‌న్న‌ట్లుగా బ‌డ్జెట్ ను రూపొందించినట్లుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. స‌మాజంలో అణ‌గారిన వ‌ర్గాల సంక్షేమం ముఖ్య‌మే కానీ.. ఆ పేరుతో నిధులు మొత్తం కొంద‌రికే ప‌రిమితం చేయ‌టం స‌మాజంలో అస‌మాన‌త‌ల‌కు.. అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌టం కనిపిస్తుంది.

ఓటు బ్యాంకు రాజ‌కీయ‌మే త‌మ లక్ష్య‌మ‌న్న‌ట్లుగా ఈటెల బ‌డ్జెట్ క‌నిపిస్తుంది. ఎందుకంటే.. ఎస్సీ అభివృద్ధికి రూ.12.7వేల కోట్లు.. ఎస్సీ.. ఎస్టీ ప్ర‌త్యేక ప్ర‌గ‌తికి రూ.9693 కోట్లు.. ఎస్టీల అభివృద్ధి శాఖ‌కు రూ.8063 కోట్లు.. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు రూ.5920 కోట్లు.. వివిధ వ‌ర్గాలను సంతృప్తి ప‌రుస్తూ కోట్లాది రూపాయిలు కేటాయింపులు చూస్తే.. ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేస్తున్న ప‌న్ను వ‌సూళ్లు కొన్ని అంశాల‌కే ప‌రిమితం కావ‌టం క‌నిపిస్తుంది.

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ప్ర‌తిఒక్క‌రికి అవ‌స‌ర‌మైన వైద్య సేవ‌ల‌కు ఈటెల వారి బ‌డ్జెట్ లో కేటాయించింది కేవ‌లం రూ.7375 కోట్లు మాత్ర‌మే. ఇందులో నిర్వ‌హ‌ణ‌.. జీత‌భ‌త్యాల్ని తీసివేస్తే.. మిగిలేది నామ‌మాత్ర‌మే. ఇక‌.. ప్ర‌భుత్వ రంగ వైద్య సంస్థ‌ల వృద్ధి ఏ విధంగా ఉంటుంది?  ప్రైవేటు వైద్య సంస్థ‌ల కాసుల క‌క్కుర్తితో పేద‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు కుదేలు అవుతున్న తీరును మ‌ర్చిపోకూడ‌దు. వివిధ వ‌ర్గాల వారికి సంక్షేమం పేరుతో వారిని సంతృప్తి ప‌రిచేలా కేటాయింపులు చేసే క‌న్నా..  విసృత స్థాయిలో అన్ని వ‌ర్గాల‌కు మేలు క‌లిగేలా చేస్తే బాగుండేది.

ప్ర‌తి ఏటా వేలాది ప్ర‌మాదాల‌కు గురై పెద్ద సంఖ్య‌లో మ‌ర‌ణిస్తున్న వైనం తెలిసిన విష‌య‌మే. రోడ్ల నాణ్య‌త‌.. వాటి భ‌ద్ర‌త విష‌యంలో అంద‌రూ వేలెత్తి చూపించే వేళ‌.. వాటిని అభివృద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం కేటాయించిన మొత్తం ఎంతో తెలుసా?  కేవ‌లం రూ.5575 కోట్లు. ఇవి రోడ్లకుమాత్ర‌మే కాదు.. ర‌వాణా.. భ‌వ‌నాల‌కు కూడా అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇలా కీల‌క‌మైన శాఖ‌ల‌కు అర‌కొర నిధులు కేటాయించి.. మొత్తం నిధుల్ని రైతులు.. సాగునీటి ప్రాజెక్టుల‌కు ప‌రిమితం చేయ‌టం వ‌ల్ల అభివృద్ధి ర‌థం ఒక‌వైపుకు వంగిపోయే ప్ర‌మాదం ఉంది. ప్ర‌భుత్వ ర‌థం ఎప్పుడు స‌మ‌తుల్యంతో ఉండాలే కానీ ఒక‌వైపున‌కు వంగిపోవ‌టం.. అదీ ఎన్నిక‌ల ఏడాది అంటేనే.. ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త ఏమిటో ఇట్టే అర్థం కాక మాన‌దు.
Tags:    

Similar News