ఈటల తాజా పంతం: చావనైనా చస్తా కానీ కేసీఆర్ కు మాత్రం లొంగడట

Update: 2021-10-14 03:55 GMT
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి అంతకంతకూ పెరుగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా పూర్తి కావటం.. బరిలో ఉన్న వారెవరూ తేలిపోయిన నేపథ్యంలో.. ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్ వాయు వేగంతో నియోజకవర్గాన్ని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా.. విపరీతంగా కష్టపడుతున్నారు.

మొదట్లో కాస్తంత తడబాటుకు గురైనా.. ఆ తర్వాత రాటు దేలటమే కాదు.. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న ఈటల తీరు చూస్తే..తాజా ఉప ఎన్నికల్లో గెలుపు మీద తప్పించి మరేదీ ముఖ్యం కాదన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

తాను జీవించి ఉన్నంత కాలం కేసీఆర్ మీద పోరాటం చేస్తూనే ఉంటానని.. డబ్బుకు ఓట్లు వేస్తారనే చిల్లర ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా మండిపడ్డారు. ఈ నెల 30న హుజూరాబాద్ ప్రజలు ఆయనకు సరైన రీతిలో బుద్ది చెబుతారన్నారు. ప్రజలకు కేసీఆర్ ఇస్తున్న సొమ్ము భూమి అమ్మినవో.. చెమటోడ్చి సంపాదించినవో కావని.. అవన్నీ ప్రజాధనమేనని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈటల నోటి నుంచి ఒక ఘాటు పోలిక  వచ్చింది.

బండి నీడన వెళుతున్న కుక్క.. తానే బండిని లాగుతున్నట్లుగా భావిస్తుందని.. కేసీఆర్ సైతం అదే భ్రమలో ఉన్నారన్నారు. తాను చావనైనా చస్తాను కానీ కేసీఆర్ కు మాత్రం లొంగే ప్రసక్తే లేదన్నారు. ప్రజల వల్లే కేసీఆర్ బతుకుతున్నారని.. ఆయన మాత్రంతాను ప్రజల్ని బతికిస్తున్నాననే భ్రమలో ఉన్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ కు ఎంత పేరు ఉన్నదో తనకు కూడా అంతే ఉందని.. తాను కష్టపడి సంపాదించుకున్న పేరును పీకేద్దామని కుట్ర చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరి.. రాజేందర్ నోటి నుంచి వచ్చే మాటలు ఆయన కోరుకున్నట్లుగా ఓట్లు రాలుస్తాయా? లేదా? అన్నది మరికొద్దికాలం వెయిట్ చేస్తే తేలిపోతుందని చెప్పాలి.
Tags:    

Similar News