అవును.. ఈటీవీ టాప్ లో నిలిచింది

Update: 2015-10-27 05:57 GMT
తెలుగు టీవీ ఛానళ్ల రేటింగ్ ల విషయంలో అనూహ్య పరిణామంగా దీన్ని చెప్పొచ్చు. నిన్నమొన్నటి వరకూ తెలుగు టీవీ ఛానళ్లలో కిందన కనిపించే ‘ఈటీవీ’ తాజాగా టాప్ స్థానంలో నిలవటం విశేషం. రేటింగ్స్ విషయంలో అగ్రస్థానాన కనిపించని ఈటీవీ.. తాజాగా అందుకు భిన్నంగా అగ్రస్థానంలో నిలవటమే కాదు.. ప్రాంతీయ భాషా ఛానళ్లలో ఈటీవీ చానళ్లకు జాతీయ స్థాయిలో రెండోస్థానంలో నిలవటం గమనార్హం.

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) దేశంలో తొలిసారి పట్టణ.. గ్రామీణ ప్రాంతాల్లో కలిపి రేటింగ్స్ ప్రకటించింది. ఈ రేటింగ్స్ లో తెలుగు ఛానళ్లలో ఈటీవీ అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశం ఏం చేస్తోంది అన్న పేరుతో దేశ వ్యాప్తంగా వివిధ మార్గాల్లో టీవీ చూస్తున్న వారికి సంబంధించి రేటింగ్స్ ను మదింపు చేశారు. ఈ సర్వేలో దేశ వ్యాప్తంగా దాదాపు 15.35కోట్ల గృహాలు ప్రాతినిధ్యం వహించాయి. ఇందులో 7.75 కోట్లు పట్టణ గృహాలు.. 7.6కోట్లు గ్రామీణ గృహాలు ఉన్నాయి.

 అక్టోబర్ 10 – 16 మధ్య 41వ వారానికి వెల్లడైన ఈ రేటింగ్ లో తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్ల మొత్తం రేటింగ్ లలో ఈటీవీ 31 శాతాన్ని సొంతం చేసుకొని అగ్రస్థానంలో నిలిచింది. 27 శాతంతో మా టీవీ రెండో స్థానంలో.. 23 శాతంతో జీ టీవీ.. 19 శాతంతో జెమినీ టీవీ నిలిచాయి. ఈ స్థాయిలో ఈటీవీ దూకుడు ప్రదర్శించటం విశేషంగా చెబుతున్నారు.
Tags:    

Similar News