ఈ వయస్సులో కూడా కష్టాలు తప్పలేదా ?

Update: 2021-10-03 12:30 GMT
ఇంత వయస్సులో కూడా చంద్రబాబునాయుడుకు కష్టాలు తప్పటంలేదు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తొందరలోనే ప్రజాయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. యాత్ర విజయవంతానికి పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. పార్టీ నేతలతో మాట్లాడుతు గతంలో 'వస్తున్న-మీకోసం' జరిపిన యాత్ర విశేషాలను పంచుకున్నారు. తాను కష్టపడి రాష్ట్రాభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొత్తం విధ్వంసం చేసేసినట్లు మండిపడ్డారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను ఐదేళ్ళల్లో చేసిన డెవలప్మెంట్ ఏమిటి ? జగన్ రెండున్నరేళ్ళ పాలనలో చేసిన విధ్వంసం ఏమిటనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. నిజంగానే చంద్రబాబు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తే మరి జనాల అంత ఘోరంగా ఎందుకు ఓడించారంటే మాత్రం చంద్రబాబు అండ్ కో దగ్గర సమాధానం ఉండదు. కాకపోతే పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారని, సంపదను సృష్టించలేకపోయారని అంటారు.

తాను కష్టపడి డెవలప్ చేసిన అమరావతిలో విధ్వంసాలు సృష్టించినట్లు పదే పదే బురద చల్లేస్తారు. అమరావతి విషయంలో జగన్ పునరాలోచన చేయటానికి తానే కారకుడనన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు కన్వీనియంట్ గా మరచిపోతారు. భ్రమల్లో కాకుండా వాస్తవాల ఆధారంగా సచివాలయం, అసెంబ్లీ, రాజభవన్, హైకోర్టు నిర్మాణాలను పక్కాగా పూర్తిచేసేసుంటే ఇపుడు జగన్ మూడు రాజధానుల కాన్సెప్టు తేవటానికి అవకాశమే ఉండేదికాదు.

పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారంటు అదానీ గ్రూపును ప్రస్తావిస్తుంటారు. చంద్రబాబు అండ్ కో చెబుతున్నదే నిజమైతే  అదే అదాని గ్రూపు రాష్ట్రంలో పరిశ్రమలను పెడతానని ఎందుకు ముందుకొస్తోంది. కాబట్టి చంద్రబాబు చేసిన అభివృద్ధి లేదు జగన్ చేస్తున్న విధ్వంసమూలేదు. అంతా రాజకీయంగా జగన్ పై బురద చల్లేయటమే.  తనకు మద్దతుగా నిలబడే బలమైన మీడియా ఉందికాబట్టే బురదచల్లే యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది.

ఇక ప్రస్తుతానికి వస్తే ఈ వయసులో కూడా చంద్రబాబు ప్రజాయాత్ర చేయాల్సి రావటం బాధాకరమనే చెప్పాలి. నారా లోకేష్ అందిరాలేదు కాబట్టే ఇంతవయసులో కూడా చంద్రబాబే ప్రజాయాత్రంటు రెడీ అవుతున్నారు. అసలు లోకేష్ ఆధ్వర్యంలోనే పాదయాత్రని, సైకిల్ యాత్రని బాగా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారం వెనకబడిపోయి చంద్రబాబు ప్రజాయాత్ర ముందుకొచ్చింది. నిజానికి 72 ఏళ్ళ వయసులో చంద్రబాబు యాత్ర ఆరోగ్యారీత్యా ఏమాత్రం మంచిదికాదు.

అయితే తొందరలోనే ప్రజాయాత్ర మొదలుపెడతానని చెప్పిన చంద్రబాబు పాదయాత్ర చేస్తారా లేక బస్సుయాత్ర చేస్తారా అన్నది మాత్రం క్లారిటి ఇవ్వలేదు. రూపం ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసే ఉద్దశ్యంతో ప్రతిపక్ష నేత యాత్ర చేయాలనుకోవటం మంచిదే. కాకపోతే ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుందో కూడా చూసుకోవాలి. మరి ప్రజాయాత్ర పై మరిన్ని విశేషాలను చంద్రబాబు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News