పవన్ కళ్యాణ్ కు రూ.1000 కోట్ల ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్

Update: 2022-06-07 13:30 GMT
క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది చేసినా వింతే. ఆయన ఏం మాట్లాడినా అది వైరల్ అవుతుంటుంది. పాల్ చేసే రాజకీయ కామెడీని జనాలు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బాగానే ఎంజాయ్ చేశారు. ఎన్నికల తర్వాత మాయమైన కేఏ పాల్ ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. తెలంగాణ , ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.

తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని వదిలేసి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీనో గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ను గెలిపించకపోతే రూ.1000 కోట్ల నజరానా  ఇస్తానని ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీచేసినా.. ఇతర పార్టీలతో కలిసి పోటీచేసినా గెలవడని  కేఏ పాల్ జోస్యం చెప్పారు. ఈ మేరకు కేఏ పాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తులో ఉండి బైబిల్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ సీటు తప్ప మిగిలిన అన్నీ ఎంపీ సీట్లు ప్రజాశాంతి పార్టీకే వస్తాయని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచేసి ఇక్కడ ముఖ్యమంత్రి పదవులను పంచేస్తానని వ్యాఖ్యానించారు.

ప్రజాశాంతి పార్టీలో చేరితే పవన్ కళ్యాణ్ కు ఒక ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటూ ఆఫరిచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులంతా ప్రజాశాంతి పార్టీకి ఓటేయ్యాలని కేఏ పాల్ అంటున్నారు.

వచ్చే ఎన్నికల కోసం ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని కేఏ పాల్ స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. చంద్రబాబు తన ఆస్తులను కాపాడుకునేందుకే తన కుమారుడు లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని కేఏ పాల్ ఆరోపించారు.
Tags:    

Similar News