ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదు. ఆంధ్రాలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత కొద్దికాలంగా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరిగిపోయాయి. గతంలో చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ అధికారిగా పనిచేసి, రాయలసీమ ఐజీగా పదవీ విరమణ చేసిన మహ్మద్ ఇక్బాల్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ఇక్బాల్ కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. 2004 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ అధికారిగా ఇక్బాల్ ఉన్నారు. గత నాలుగేళ్లలో కేంద్రం మీద నెపం మోపుతూ, విభజనను సాకుగా చూపుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో పాలనను గాలికి వదిలేశారు. అభివృధ్ది లేక, ఎన్నికల హామీలు తీర్చక ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు.
ప్రజా వ్యతిరేకతను గమనించిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా అంశాన్ని తెరమీదకు తెచ్చి కేంద్రంలో తమ పార్టీ మంత్రులతో రాజీనామా చేయించి బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఈ పరిణామాలు టీడీపీకి మేలు చేస్తాయని చంద్రబాబు భావించినా ప్రజలు మాత్రం ఆయనను పట్టించుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవల పెరిగిన వలసలు దీనిని రుజువు చేస్తున్నాయి.