తెలంగాణ‌... ఎఫ్‌.బీ. సీఎం - ట్విట్ట‌ర్ పార్టీ

Update: 2019-03-31 08:01 GMT
తెలంగాణ‌లో మూడు ఎమ్మెల్సీలు టీఆర్ ఎస్‌ ఓడింది. ఇది కేవ‌లం మూడు ఎమ్మెల్సీల ఓట‌మి కాదు. ఇంత‌కాలం టీఆర్ ఎస్‌ పై విమ‌ర్శ‌లు చేస్తే ఎట్లా... జ‌నం అంతా కేసీఆర్ వైపు ఉన్నారేమో. ఎందుకొచ్చిన గొడ‌వ అనుకునే వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ఓట‌మి ఇది. తండ్రీ కొడుకులు ప్ర‌జ‌ల‌కు దూరంగా సోష‌ల్ మీడియాకు ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని తెలంగాణ‌లో కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి.

ఇటీవ‌ల ఓ అనామ‌క రైతు త‌న‌కు పొలం ఉంది. ప‌ట్టా ఇవ్వ‌లేదు. ధ‌ర‌ణిలో అప్‌ లోడ్ చెయ్యలేదు అని ఫేస్‌ బుక్‌ లో వీడియో పెట్టాడు. అస‌లే లోక్‌ స‌భ ఎన్నిక‌లు. దీన్ని వాడుకుంటే ఫుల్ ప్ర‌మోష‌న్ అని భావించిన కేసీఆర్ ఏ విప‌రిణామాలు ఆలోచించ‌కుండా ఎద్దు ఈనింద‌ని ఎవ‌రో చెబితే దూడ‌ను గాట్లో క‌ట్టేయ్ అన్న‌ట్టు... వాడు చెప్పిందే వేదం న‌మ్మేసి క‌లెక్ట‌ర్‌ ను ఆదేశించారు. ముఖ్య‌మంత్రి ఎన్నిక‌ల మూడ్‌ లో బోల్త‌ప‌డ్డాడు. ఐఏఎస్ రాసి పాస‌యిన ఆ క‌లెక్ట‌రు కూడా దొర చెప్పాడు ... నేను చేయాలి. మార్కులు కొట్టేయాలి అని ఠ‌క్కున ఆ రైతు అడిగింద‌ల్లా ఊరికెళ్లి చేసింది. కట్ చేస్తే అంతా హంబ‌క్‌. అయితే... ఇది ఇంత డిజాస్ట‌ర్ కావ‌డానికి కార‌ణం... కేసీఆర్ కేవ‌లం ఆ రైతు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంతో వ‌దిలేయ‌కుండా ఏడు నిమిషాలు మాట్లాడి తెలంగాణ‌కు తానే దేవుడు మిగ‌తా అంద‌రూ దెయ్యం అన్న‌ట్లు వివ‌రిస్తూ ఆ ఆడియోను సీఎం ఆఫీసే సోష‌ల్ మీడియాలో లీక్ చేయ‌డం వ‌ల్ల కొంప‌ముంచింది. తీరా ఆ రైతు చెప్పిన‌దంతా నిజం కాదు. అందులో కుటుంబ వివాదం ఉంది. ఆ పొలం మొత్తం రైతుది కాదు. అని తేల‌డంతో ముఖ్య‌మంత్రి ప‌బ్లిసిటీ ఐడియా డిజాస్ట‌ర్ అయ్యింది.

మ‌రోవైపు నేరుగా మంత్రుల‌కు కూడా స‌రిగా దొర‌క‌ని కేటీఆర్‌... ట్విట్ట‌రులో మాత్రం శ‌భాష్ శ‌భాష్ అనిపించుకోవ‌డానికి తెగ టైం కేటాయిస్తారు. అయితే, అందులో కొంద‌రికి మంచి జ‌రిగింది. దాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు గానీ... ఈ ట్విట్ట‌రు యాక్సెస్ ఎంత మంది తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉంటుంది. నిజ‌మైన పేద‌లకు ట్విట్ట‌రు వాడేంత‌టి అవ‌కాశ‌మూ - జ్ఞాన‌మూ ఉంటుందా? ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా నాలుగు క‌న్నీటి చుక్కులు కార్చిన‌ వారికి ట్విట్ట‌రులో సాయం చేసి తెలంగాణ మొత్తానికి అందుబాటులో ఉన్నామ‌ని చెప్పుకోవ‌డం దారుణ‌మే క‌దా.

ఇలా తండ్రీ కొడుకులు సోష‌ల్ మీడియానే తెలంగాణగా భావిస్తే నాలుగు కోట్ల మంది ప‌రిస్థితి ఏంది? ప‌్ర‌జ‌ల‌కు నేరుగా అందుబాటులోకి రావ‌డం వ‌ల్లే జ‌రిగే మేలు ఎంతో రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో అంద‌రికీ అర్థ‌మైంది క‌దా. ఎంత‌కీ ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌లు క్యాంప్ ఆఫీస్ లో రోజూ ప్ర‌జ‌ల‌కు సింపుల్‌గా తేల్చేసేవారు. అలాంటి ప‌ని ఎందుకు చేయ‌రు ... అని వాయిస్ గ‌ట్టిగా వినిపిస్తోంది. తండ్రి ఎఫ్‌ బీ రైడ‌ర్‌ - కొడుకు ట్విట్ట‌రు పిట్ట అంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇది కొంప‌లు ముంచ‌క‌ముందే మేల్కొంటే పార్టీకి మంచిది, తెలంగాణ‌కూ మంచిదే. ముఖ్య‌మంత్రి సచివాల‌యానికి వ‌స్తారా రారా అన్న‌ది పాయింట్ కాదు... ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారా లేరా అన్న‌ది పాయింట్‌.


Tags:    

Similar News