పండుగ పూట చంద్రబాబుకు ఖుషీ కబర్.. ఆ కేసులో భారీ ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. 53 రోజులపాటు చంద్రబాబు జైలులో ఉన్నారు. 2023లో ఈ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా..
సంక్రాంతి పండుగ పూట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సుప్రీంకోర్టు తీపి కబురునిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎంకు భారీ ఊరట లభించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. 53 రోజులపాటు చంద్రబాబు జైలులో ఉన్నారు. 2023లో ఈ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. దానిని రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించి ఈ కేసును కొట్టేసింది.
దీనిపై సీరియస్‌గా వాదనలు జరిగాయి. కాగా.. ఇప్పటికే ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వివరించారు. చార్జిషీట్ ఫైల్ కావడంతో జోక్యం అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఓ పాత్రికేయుడు ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసుతో మీకేం సంబంధం..? మీరెవరు..? పిల్ దాఖలుకు అర్హత ఏముంది..? అని నిలదీసింది. బెయిల్ వ్యవహారంతో మూడో వ్యక్తం అవసరం ఏంటని ప్రశ్నించింది. సంబంధం లేని అంశంలో పిటిషన్ ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అలాగే.. ఆ ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను డిస్మిస్ చేసింది.