ఫాల్కన్ స్కాంలో 19మందిపై ఈడీ కేసులు.. సంచలన విషయాలు వెలుగులోకి

అమాయకుల అత్యాశను సొమ్ము చేసుకోవడానికి దొంగ సంస్థలు వెలుస్తున్నాయి. జనాల నుంచి కోట్లకు కోట్లు దండుకుని బోర్డు తిప్పేస్తున్నాయి. అలాంటిదే ఫాల్కన్ స్కాం.

Update: 2025-02-22 09:30 GMT

దేశంలో మనీ మోసాలు ఎక్కువయ్యాయి. రోజుకు వందల్లో డబ్బుకు సంబంధించిన మోసాలు బయటకు వస్తున్నాయి. దేశంలో చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడటం..తొందరగా సంపన్నులం అయిపోవాలన్న అత్యాశతో మోసగాళ్ల చేతిలో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు. అమాయకుల అత్యాశను సొమ్ము చేసుకోవడానికి దొంగ సంస్థలు వెలుస్తున్నాయి. జనాల నుంచి కోట్లకు కోట్లు దండుకుని బోర్డు తిప్పేస్తున్నాయి. అలాంటిదే ఫాల్కన్ స్కాం. ఈ స్కాం నిందితులపై తాజాగా ఈడీ కేసులు నమోదు చేసింది.

ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో వేలమందిని మోసం చేసిన కేసులు ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఎన్ ఫోర్స్ మెంట్ కేసు ఇన్ ఫార్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. హైదరాబాద్ మహా నగరంలోని హైటెక్ సిటీ హుడా ఎన్ క్లేవ్ కేంద్రంగా ఫాల్కన్ సంస్థ ఇన్వాయిస్ డిస్కౌంట్ల పేరుతో భారీగా లాభాలు వస్తాయని చెప్పి దాదాపు రూ.1,700 కోట్ల మేర వసూలు చేసినట్టు తేలింది. ఈ సంస్థ నిర్వాహకులు దుబాయ్, మలేషియా సహా మొత్తం 14 షెల్ కంపెనీలకు రూ.850 కోట్లు మళ్లించినట్టు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సివ్ వింగ్ నిర్ధారించింది.

ఈ కేసులో మొత్తం 19 మందిపై ఈడీ కేసులు నమోదు చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైస్ చైర్మన్ పవన్ కుమార్, డైరెక్టర్ కావ్య, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనంతను అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన ఫాల్కన్ డైరెక్టర్ అమర్ దీప్ కుమార్, సీఏవో ఆర్యన్ సింగ్, సీఈవో యోగేంద్ర సింగ్ దుబాయ్ కి పరారైనట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగానే విదేశాల్లో ఉన్న ఫాల్కన్ షెల్ కంపెనీలకు క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో మళ్లించిన నిధుల వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు.

ఇన్వాయిస్ డిస్కౌంట్స్ ఆఫర్ పేరుతో నాలుగేళ్లుగా ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 6,979 మంది డిపాజిటర్ల నుంచి 1700 కోట్లు వసూలు చేసినట్టుగా ఇప్పటికే తేలింది. అయితే తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే..ఏడాదికి 11 నుంచి 22 శాతం రిటర్న్ ఇస్తామని అందరికీ మాయమాటలు చెప్పి.. నమ్మించి నట్టేట ముంచేశారు. దర్యాప్తులో భాగంగా కేసుకు సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో రెండు లేదా మూడు రోజుల్లో ఈడీ సోదాలు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్కాంలో ప్రధాన సూత్రధారులు అమన్ దీప్ కుమార్(ఎండీ), ఆర్యన్ సింగ్(సీవోవో), యోగేంద్ర సింగ్(సీఈవో) విదేశాల్లో జల్సాలకు, విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా ఓ చార్టెడ్ విమానాన్ని కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన డబ్బు నుంచే కోట్లు పెట్టి విమానాన్ని కొన్నట్లు అధికారులు చెప్పారు. వీరిపై లుకౌట్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టులలో అధికారులను అప్రమత్తం చేశారు.

Tags:    

Similar News