ఫైబర్ మంటలు.. చైర్మన్ వర్సెస్ ఎండీ.. సర్కారు సపోర్టు ఎవరికి?

ఏపీ ఫైబర్ నెట్ లో చైర్మన్ జీవీ రెడ్డి, ఎండీ దినేశ్ కుమార్ మధ్య వివాదంతో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

Update: 2025-02-22 09:47 GMT

ఏపీ ఫైబర్ నెట్ లో చైర్మన్ జీవీ రెడ్డి, ఎండీ దినేశ్ కుమార్ మధ్య వివాదంతో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇష్యూలో ఎవరిని సపోర్టు చేయాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో సీనియర్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ప్రభుత్వం రంగంలోకి దింపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక వంటి ఫైబర్ నెట్ పై గతం నుంచి ఎన్నోవివాదాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి చవక ధరకే ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సౌకర్యం కల్పించేందుకు చంద్రబాబు 3.0 ప్రభుత్వంలో ఫైబర్ నెట్ తీసుకువచ్చారు. వైసీపీ పాలనలో ఫైబర్ నెట్ ను నిర్లక్ష్యం చేయడంతో అప్పుల ఊబిలో కూరుపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు 4.0 సర్కారులో ఫైబర్ నెట్ కు పూర్వ వైభవం తెద్దామని భావించారు. కానీ, సంస్థను జోడెద్దుల్లా నడపాల్సిన చైర్మన్, ఎండీ మధ్య అనూహ్యంగా వివాదం తలెత్తడం ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారింది.

ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డికి సబ్జెక్టు మీద మంచి పట్టుఉంది. ఉన్నత విద్యావంతుడైన జీవీ రెడ్డి తనపై నమ్మకంతో చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలని ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నుంచి ఫైబర్ నెట్ ప్రక్షాళనకు అనేక అడుగులు వేశారు జీవీ రెడ్డి. ఆయనకు ప్రభుత్వం కూడా అన్ని విధాల సహకరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ కూడా జీవీ రెడ్డిని ప్రోత్సహించారు. అయితే తన ప్రయత్నాలకు అధికారులు గండి కొడుతున్నారని రగిలిపోతున్న జీవీ రెడ్డి.. మీడియా సాక్షిగా బరెస్ట్ కావడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందంటన్నారు. ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాన్ని రచ్చ చేయడంపై ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లైంది. అయితే చైర్మన్ జీవీ రెడ్డి నిబద్ధత, పార్టీ పట్ల అంకితభావం వల్ల ఆయనను ఏమీ అనలేకపోయింది. ఎండీ దినేష్ కుమార్ పై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం తరఫున మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారని చెబుతున్నారు. నిన్న మంత్రి జానర్దన్ రెడ్డితో జీవీ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించడంతో ఆయన ఈ విషయాన్ని సీఎంకి నివేదిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఐఏఎస్ అధికారి, ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను కూడా మంత్రి వివరణ కోరారు. అయితే తనపై చైర్మన్ చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని ఆయన మంత్రిని కోరినట్లు చెబుతున్నారు. ఐఅండ్ఐ కార్యదర్శి యువరాజుతో కలిసి మంత్రిని కలిసిన ఎండీ దినేష్ కుమార్ చైర్మన్ చేసిన ఆరోపణలకు తాను బాధ్యుడిని కానని మౌఖికంగా చెప్పినట్లు తెలుస్తోంది. జీఎస్టీ, ఆదాయ పన్ను వ్యవహారాలను కన్సల్టెన్సీ చూస్తుందని, అందులో తన పాత్ర ఏమీ ఉండదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎండీ ఏం చెప్పాలన్నా లిఖితపూర్వకంగా ఇవ్వాలని మంత్రి సూచించినట్లు చెబుతున్నారు.

అయితే ఫైబర్ నెట్ వివాదం ఏపీ ప్రభుత్వంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకపక్క పార్టీ నేత, మరోవైపు ఐఏఎస్ అధికారి ఉండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైర్మన్ ఆదేశాలను ఎండీ పాటించకపోవడం కరెక్టు కాదని కొందరు అంటుంటే.. తమ అధికారాలను గుంజుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఆమోదిస్తామంటూ ఐఏఎస్ వర్గాలు వాదిస్తున్నట్లు చెబుతున్నారు. విషయం ఏదైనా అంతర్గతంగా చర్చించాల్సిది పోయి ఇలా నేరుగా మీడియాకు ఎక్కడం కరెక్టు కాదని ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.

కాగా, ఫైబర్ నెట్ వివాదం కూటమి సర్కారులో సెగలు పుట్టిస్తోంది. రాష్ట్రంలో ఫైబర్ నెట్ ఒక్కటే కాకుండా పలు కార్పొరేషన్ వ్యవహారాల్లో ఈ తరహా వివాదాలు రేగుతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందిందని అంటున్నారు. యువకుడు, విద్యావంతుడు, పైగా న్యాయవాది అయిన జీవీ రెడ్డి ఈ విషయంలో బహిరంగంగా స్పందించడంతో మిగిలిన చైర్మన్లు కూడా తమ బాధలను పార్టీ దృష్టికి తీసుకువెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు పదవులిచ్చినా, అధికారం లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నామని కొందరు వాపోతున్నారంటున్నారు. మరోవైపు ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి విమర్శలు చేసిన ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చైర్మనుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది అక్టోబరులో విజయవాడలో డ్రోన్ ప్రదర్శన నిర్వహించి ఐదు గిన్నిస్ రికార్డులు నమోదు చేశారు. ఈ సమయంలో ఐఏఎస్ దినేష్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు అందుకున్నారు. అయితే ఫైబర్ నెట్ వ్యవహారంలో ఆయన సహకరించడం లేదన్న ఆరోపణలతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గతంలో సీఎం ప్రశంసలు అందుకున్న అధికారి.. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ఆరా తీస్తోంది. ఏదిఏమైనా ఈ వివాదం మరింత ముదరకముందే ముగింపు చెప్పాలనే ఆలోచనతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News