మోడీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వంలో వారంతా..ప్ర‌త్యేక ఆహ్వానితుల‌ట‌!

Update: 2019-05-29 07:25 GMT
మోడీషాల తీరు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వారు టార్గెట్ చేస్తే.. దాన్ని సాధించే వ‌ర‌కూ నిద్ర‌పోరు. అందుకు దేనికైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వారి తీరు ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకుంద‌ని చెప్పాలి. దేశ ప్ర‌ధానిగా రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్ట‌నున్న మోడీ.. త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం వేళ‌.. ఎవ‌రూ ఊహించని నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

గురువారం రాత్రి రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్న త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. గ‌వ‌ర్న‌ర్ల‌తో పాటు.. విదేశీ అతిధులు.. బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో పాటు ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల్ని ఆయ‌న ఆహ్వానించారు.

ఇదంతా మామూలే అయినా.. ఇక్క‌డే ఒక ట్విస్ట్ ఉంది. దాదాపు 50 మందికి పైగా బీజేపీ కార్య‌క‌ర్త‌ల్ని ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తున్నారు. అది కూడా ప్ర‌త్యేక ఆహ్వానితుల కోటాలో వారిని ఈ కార్య‌క్ర‌మానికి పిలుస్తున్నారు. ఇంత‌కీ ఆ బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రో తెలుసా?  ఇటీవ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌శ్చిమ‌బెంగాల్ లో చోటు చేసుకున్న హింస‌కు బ‌లైన బీజేపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబ స‌భ్యులను త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ఆహ్వానిస్తున్నారు.

తృణ‌మూల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కార్య‌క‌ర్త‌ల కుటుంబ స‌భ్యుల్ని దేశ ప్ర‌ధాని హోదాలో త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ఆహ్వానించ‌టం ద్వారా రాజ‌కీయ వ‌ర్గాల‌కు మోడీ విస్మ‌యానికి గురి చేస్తున్నార‌ని చెప్పాలి. పార్టీకి చెందిన కిందిస్థాయి కార్య‌క‌ర్త‌ను తాను విస్మరించ‌న‌ని.. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని అస్స‌లు మ‌ర‌వ‌న‌న్న సందేశాన్ని ఆయ‌న చేత‌ల్లోచేసి చూపించార‌ని చెప్పాలి.   ఇలాంటి నిర్ణ‌యాలు మోడీ మాత్ర‌మే తీసుకోగ‌ల‌రేమో?
Tags:    

Similar News