మోడీ ప్రభుత్వంపై రైతులే కోర్టుకు వెళ్లారు..!

Update: 2015-04-10 07:00 GMT
భూ సేకరణ చట్టంపై ఎవరేమన్నా విననట్టుగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వ తీరుపై రైతు సంఘాలు కన్నెర చేస్తున్నాయి. భూ సేకరణ చట్టంలో మార్పులు తీసుకురావాలన్న తమ నిర్ణయం చట్టసభల్లో ఆమోదం పొందకపోవడంతో మోడీ సర్కారు ఆర్డినెన్స్‌ల మీద ఆర్డినెన్సులు తీసుకు వస్తూ తమ నిర్ణయాన్ని అమలు పరుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీనిపై రైతు సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ ఆర్డినెన్స్‌ అన్యాయమని.. అక్రమమని రైతు సంఘాలు అత్యున్నత న్యాయస్థానానికి నివేదించాయి. ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయించాలని కోర్టును కోరాయి.

    భూ సేకరణ చట్టంలో మార్పులు తీసుకురావాలని భావించడమే అన్యాయమని.. ఈ మార్పులు రైతులను ఇబ్బంది పెడతాయని.. అదే అక్రమం అనుకొంటే.. ఆర్డినెన్స్‌లు జారీ చేయడం చట్టపరంగా మరో అక్రమమని రైతు సంఘాలు నివేదించాయి.

    మోడీ సర్కారు వరసగా ఆర్డినెన్స్‌లు జారీ చేయడం అనేది రాజ్యాంగవిరుద్ధమని రైతులు సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    భూ సేకరణ చట్టంలో సవరణలను ఆమోదింపజేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రైతులను ఉద్ధరించేస్తామని పైకి చెబుతున్నప్పటికీ ఈ మార్పులు అన్నీ కార్పొరేట్ల కొమ్ము కాసేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదో కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయాలను కాకుండా.. రైతుల, సామాజిక పరిశీలకుల అభిప్రాయాలను, విశ్లేషణలను పరిగణనలోకి తీసుకొన్నా.. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే ఈ సవరణలు చేపడుతోందని స్పష్టం అవుతోంది.

    రాజ్యసభలో సరైన బలం లేని మోడీ సర్కారు ఈ సవరణల బిల్లును అమోదింపజేసుకోలేకపోతోంది. దీంతో ఆర్డినెన్స్‌లు జారీ చేస్తూ బండి లాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతులే కోర్టుకు ఎక్కారు. ఈ భూ సేకరణ చట్టం సవరణల బారి నుంచి తమను రక్షించాలని న్యాయస్థానాన్ని కోరుకొంటున్నారు.

    మరి ఇప్పుడు కోర్టు రైతులను రక్షిస్తుందా? ఈ విధానం విషయంలో ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకొనే అధికారం కోర్టుకు ఉంటుందా? అనేవి సందేహాలు. అయితే మోడీ ప్రభుత్వ మంత్రులు మాత్రం ఈ భూ సేకరణ చట్టం సవరణలను సమర్థిస్తున్నారు! ఇవన్నీ రైతుల కోసమే అని చెప్పుకొస్తున్నారు. అయినా ఆలా చెప్పకపోతే ఆశ్చర్యపోవాలి కానీ, చెబితే ఆశ్చర్యం ఎందుకు?!



Tags:    

Similar News