కాల్పుల ఘటనలతో పెద్దన్న వణికిపోతున్నాడు

Update: 2016-07-08 16:26 GMT
ఇప్పుడు అమెరికాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్నది అర్థం కాక అమెరికా అధ్యక్షుడు మొదలు.. సగటు పోలీసు అధికారి వరకూ తలలు పట్టుకునే పరిస్థితి. ఒక చిన్న అంశం.. జాతుల మధ్య పోరుగా మారి.. పోలీసుల మీదే తుపాకులు ఎక్కుపెట్టి పిట్టల్ని కాల్చేసినట్లుగా కాల్చేస్తున్న వైనం అగ్రరాజ్యానికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. అమెరికాలోని నల్లజాతీయులు పోలీసుల్ని టార్గెట్ చేసి మరీ కాల్పులు జరపటం.. ఇప్పటికి ఐదుగురు పోలీసులు మరణించటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుందని చెప్పాలి.

కేవలం 12 గంటల వ్యవధిలో ఆగ్రరాజ్య అధిపతి పరిస్థితి మీద స్పందించారంటే విషయం ఎంత విషమంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. అమెరికాలో ఇంతటి దారుణ పరిస్థితి కారణం ఏమిటి? గొడవ ఎక్కడ మొదలైంది? జాతుల మధ్య విద్వేషం అమెరికాకు కొత్త కాకున్నా.. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది?అన్న విషయం తెలియాలంటే రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలోకి వెళ్లాలి.

మిన్నెసొటా.. సెయింట్ లూయిస్ ప్రాంతాల్లో వారం వ్యవధిలో ఇద్దరు నల్లజాతీయుల్ని పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ మరణించారు. పోలీసులు కాల్పులు జరిపే వరకూ ఎందుకు వెళ్లలేదన్న దానికి పోలీసు వర్గాలు చెబుతున్న మాటలు ఏ మాత్రం సమంజసంగా లేకపోవటం గమనార్హం. చనిపోయిన ఒక నల్లజాతీయుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వమంటే జాప్యం చేయటం.. అనుమానాస్పదంగా ఉండటంతో కాల్పులు జరిపినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ కాల్పులన్నీ జాత్యాంకారం కారణంగా జరిగినట్లుగా అభిప్రాయం వ్యక్తం కావటంతో పాటు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. జాత్యాంహకారంతో చేసిన హత్యలకు కారణమైన పోలీసుల్ని నిందిస్తూ.. డల్లాస్ లో నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా ఎత్తైన భవనాల మీద నుంచి తుపాకీలు చేతపట్టిన నల్లజాతీయులు పోలీసుల్ని టార్గెట్ చేయటం.. కాల్పులు జరపటంతో పోలీసులు ఒక్కసారి షాక్ తిన్నారు. వారు తేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

గుర్తు తెలియని దుండగులు (నల్లజాతీయులగా భావిస్తున్నారు) పోలీసుల మీద కాల్పుల కారణంగా ఐదుగురు పోలీసులు మరణించటమే కాదు.. పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది.గతంలో జాత్యాంహకారంతో నల్లజాతీయులపై కాల్పులు జరిగటం.. దానికి నిరసనగా పెద్ద ఎత్తు ఆందోళనలు జరగటం మామూలే అయినా.. ఇప్పుడు ఎదురైన పరిస్థితి గడిచిన కొన్నేళ్లుగా చోటు చేసుకోలేదు. తాజా కాల్పులతో డల్లాస్ సిటీ ఒక్కసారిగా ఉడికిపోయింది.

ఈకాల్పులకు కారణంగా భావిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. వారు విచారణకు ఏ మాత్రం సహకరించటం లేదని చెబుతున్నారు. నల్లజాతీయులపై జరుగుతున్న కాల్పులకు నిరసనగా తాము కాల్పులు జరుపుతున్నట్లుగా కొందరు దుండగలు చెబుతున్నట్లుగా స్థానికులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. డల్లాస్ నగరంలో పోలీసుల్నిలక్ష్యంగా చేసుకొని జరిపిన తాజా కాల్పుల వెనుక బయటకు రాని కుట్ర ఏమైనా దాగి ఉందా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఎత్తైన భవనాలపై నుంచి కాల్పులు జరపటం వెనుక అసలు వ్యూహం ఏమిటన్నది అమెరికన్ పోలీసుల మెదళ్లను తొలిచేస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున బలగాల్ని మొహరించారు. యుద్ధ వాతావరణాన్ని తలపించేలా డల్లాస్ నగరం మారింది. దీంతో.. అమెరికా అధ్యక్షుడు రంగంలోకి దిగారు. నల్లజాతీయులపై పోలీసుల కాల్పుల్ని తీవ్రంగా ఖండించిన ఒబామా.. తర్వాత కొద్దిసేపటికే పోలీసుల మీద దుండగులు జరిపిన కాల్పుల్ని ఖండించటం చూస్తే.. అమెరికాలోని డల్లాస్ లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నాయన్న విషయం అర్థం చేసుకోవచ్చంటున్నారు. మరి.. ఈ చిచ్చు డల్లాస్ తోనే ఆగిపోతుందా? మరింత ముదురుతుందా? అన్నది కాలమే బదులివ్వాల్సిన పరిస్థితి.
Tags:    

Similar News