బాబుకు షాక్‌...ఈ నేత‌లంతా హ‌స్తం గూటికి

Update: 2018-05-21 14:37 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. పార్టీ ఓ వైపు మ‌హానాడుకు స‌న్న‌ద్ధం అవుతుంటే మ‌రోవైపు ఆ పార్టీ వేగంగా బ‌ల‌హీన‌ప‌డుతున్న నేప‌థ్యంలో...అధికారం వ‌చ్చే అవ‌కాశం లేద‌నే ప‌రిస్థితులు నేప‌థ్యంలో అందులోని నేత‌లు త‌మ సొంత దారి చూసుకునేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే రేవంత్ రెడ్డి నేతృత్వంలో తొలివిడ‌త‌గా భారీగా కాంగ్రెస్ లోకి చేరిక‌లు జ‌రిగాయి. కాగా.. రెండో ద‌ఫా చేరిక‌ల‌్లో వివిధ పార్టీల ముఖ్యనేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సన్నిహిత వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప‌లువురు నేత‌లు హ‌స్తం గూటికి చేర‌నున్నారు. `కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న‌ బ‌స్సుయాత్ర తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టంగా నిలుస్తుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌ర‌చ‌డం, మా పార్టీ శ్రేణుల‌ను ఏకతాటిపైకి తేవ‌డం వంటి ల‌క్ష్యాలే కాకుండా కొత్త చేరిక‌ల‌కు వేదిక‌గా కాంగ్రెస్ బ‌స్సుయాత్ర ఉంటుంది. ప‌లువురు ముఖ్య నాయ‌కులు యాత్ర సంద‌ర్భంగా కాంగ్రెస్‌లో చేర‌నున్నారు` అంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. తెలంగాణ‌ కాంగ్రెస్ కెప్టెన్ ఇంత ధీమాగా చేసిన ప్ర‌క‌ట‌న స‌హ‌జంగానే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. టీపీసీసీ ర‌థ‌సార‌థి చేసిన ప్ర‌క‌ట‌న మేర‌కు ఎవ‌రు కాంగ్రెస్ గూటికి చేర‌నున్నార‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. వివిధ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, కాంగ్రెస్ నాయ‌కుల విశ్లేష‌ణ‌ మేర‌కు కొంద‌రు బ‌ల‌మైన నేత‌లే హ‌స్తం గూటికి చేర‌నున్నారు.

గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ ప్ర‌కారం టీడీపీకి గుడ్ బై చెప్పి కొంద‌రు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సొంత దారి చూసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో కేసీఆర్‌పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ ఫిరాయించిన నేప‌థ్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మాజీ మంత్రి మండవ వెంక‌టేశ్వ‌ర‌రావు పార్టీ మార‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతోపాటుగా ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు అయిన కొత్తకోట ద‌యాక‌ర్ రెడ్డి, కొత్తకోట సీత ద‌యాక‌ర్ రెడ్డి పార్టీ మార‌నున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీలో త‌మ‌కు ఎలాంటి ప్రాధాన్యం ద‌క్కుతుంద‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చిన త‌ర్వాతే ఈ చేరిక‌లు ఉంటాయ‌ని స‌మాచారం.
Tags:    

Similar News