టీఆర్ఎస్ లో తీవ్ర పోటీ: కేసీఆర్, కేటీఆర్ దయ ఎవరిపైనో..

Update: 2020-02-07 09:10 GMT
తెలంగాణ లో ఎన్నికల కోలాహలం కొనసాగుతూనే ఉంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు ముగియగా ప్రస్తుతం సహకార ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటి తర్వాత రాష్ట్రంలో త్వరలో మరికొన్ని ఎన్నికలు రానున్నాయి. త్వరలోనే రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానున్నాయి. ఇప్పుడు వీటిపైనే అందరి దృష్టి పడింది. అయితే ఈ సీట్లన్నీ టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. దీంతో గులాబీ పార్టీలో పోటీ పెరిగింది. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా.. మార్చిలో రెండు రాజ్యసభ సీట్లు, జూన్లో మరో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ స్థానాల కోసం పార్టీలోని నాయకులు ఆశిస్తూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సందర్భం దొరికిన ప్రతిసారి సీఎం కేసీఆర్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసి తాము ఆశిస్తున్నది మెల్లగా చెవిలో వేస్తున్నారు.

ఖాళీలు ఇవి
- గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం, నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం
- జూన్ ఆఖరుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్ల పదవీకాలం ముగుస్తుంది.
- తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేవీపీ, గరికపాటి మోహన్ రావు పదవీకాలం మార్చితో ముగుస్తుంది.
- దీంతో తెలంగాణలో ఈ ఆరు పదవులు ఖాళీ కానున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి ఆశావహులు రాయబారం, పైరవీలు మొదలుపెట్టారు. ఈ స్థానాలను మొత్తం 20 మందికి పైగా నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

రాజ్యసభకు వీరు..
అయితే ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఉండి ఎలాంటి పదవులు చేపట్టని పలువురు నాయకులు వీటిపై శ్రద్ధ పెట్టారు. ఈసారి ఎలాగైనా తమకు ఒక పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి విన్నవిస్తున్నారు. అయితే ఈ నెలలోనే ముఖ్యమంత్రి కేటీఆర్ నియమితులయ్యే అవకాశం ఉండడం తో ఆశావహులంతా కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజ్యసభ స్థానాలపై మాజీ స్పీకర్లు సురేశ్ రెడ్డి, మధుసూదనా చారి ఆశిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్లో మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి చేరిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ స్పీకర్ మధు సూదనాచారి రాజ్యసభ సీటుపై కన్నేశారు. కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను రాజ్యసభకు పంపించే అవకాశం కూడా ఉంది. ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందడం తో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి కవితను తీసుకొచ్చేందుకు కేసీఆర్, కేటీఆర్ యోచిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నుంచి పార్టీ కార్యక్రమాలకు కవిత దూరంగా ఉంటోంది. ఆమెను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తేవాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.

ఎమ్మెల్సీ ఆశావహులు
ఇక ఎమ్మెల్సీ స్థానాలకు భారీగానే ఆశావహులు ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వి.ప్రకాశ్, దేవీప్రసాద్, దేశపతి శ్రీనివాస్, తక్కళ్లపల్లి రవీందర్ రావు తదితరులు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. కవితకు రాజ్యసభ ఇస్తే మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డికి ఈ స్థానం ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కు ఉన్న నమకస్తుల్లో కర్నె ప్రభాకర్ కూడా ఒకరు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రభాకర్ పదవీకాలం ముగుస్తున్నా అతడికి మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సీనియర్ నాయకులు, కేసీఆర్ ఏరికోరి పార్టీలోకి తీసుకు వచ్చిన మండవ వెంకటేశ్వరరావు, ఉమా మాధవ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉండి టికెట్ దక్కని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉంది.

వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీమంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, చందూలాల్ ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పట్నించి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి ఈ స్థానాలను ఆశిస్తున్నారు. మరి ఈ పదవులు కేసీఆర్, కేటీఆర్ ఎవరికీ కట్టబెడతారోనని ప్రజలతో పాటు పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.



Tags:    

Similar News