భారత్ తో ఫైట్.. ట్విట్టర్ నాకు చెప్పలేదన్న మస్క్

Update: 2022-08-06 01:30 GMT
ట్విట్టర్ కొనుగోలుకు ముందుకొచ్చి.. ఆ తర్వాత ఒప్పందాన్ని రద్దు చేసి ఆ సంస్థను చావుదెబ్బ తీసిన ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్.. ఇప్పటికీ ఆ వివాదాన్ని విడిచిపెట్టడం లేదు. ట్విట్టర్ తో కోర్టు వివాదాన్ని ఎదుర్కొంటున్నాడు. ట్విట్టర్ నకిలీ ఖాతాల వివరాలు ఇవ్వడంలో విఫలమవడంతోనే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు.  తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత ప్రభుత్వంపై ట్విట్టర్ వేసిన ‘ప్రమాదకర’ పిటీషన్ ఆ సంస్థ తనతో చేసుకున్న ఒప్పందంలో బయటపెట్టలేదని ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కోర్టులో తన కౌంటర్ దావాలో పేర్కొన్నాడు.

ఎలన్ మస్క్ తమతో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ట్విట్టర్ ‘డెలావర్ కోర్టులో దావా వేశారు. అయితే దీనిపై ఇటీవల మస్క్ కూడా కౌంటర్ దావా వేశాడు. ఆ పిటీషన్ లో వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. తనను మభ్యపెట్టి మోసం చేసి ట్విట్టర్ ను కొనుగోలు చేసేలా ఒప్పందంపై సంతకం పెట్టించారని మస్క్ ఆరోపించడం సంచలనమైంది.

ఇక భారత ప్రభుత్వంతో ట్విట్టర్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన వివాదాన్ని కూడా ఎలన్ మస్క్ తన కౌంటర్ దావాలో ప్రస్తావించడం గమనార్హం. భారత ప్రభుత్వం విధించిన చట్టాలను పాటించకుండా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ కోర్టుకు వెళ్లింది. దీంతో తన మూడో అతిపెద్ద మార్కెట్ ను ప్రమాదంలో పడేసింది. ఈ వ్యాజ్యం గురించి ట్విట్టర్ ఒప్పందంలో వెల్లడించలేదు అని మస్క్ ఏకంగా భారత్ తో ట్విట్టర్ లొల్లిని కారనంగా చూపించడం విశేషం.

ఇక మస్క్ ఆరోపణలను ట్విట్టర్ తీవ్రంగా ఖండించింది. ఒప్పందం నుంచి తప్పించుకునేందుకు మస్క్ చెబుతున్న సాకులే ఇవన్నీ అని ట్విట్టర్ విమర్శించింది. ఇక ట్విట్టర్, ఎలన్ మస్క్ పిటీషన్లపై డెలావర్ కోర్టు అక్టోబర్ 17 నుంచి ఐదు రోజుల పాటు విచారించనుంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను అన్ని సోషల్ మీడియా కంపెనీలు అమలు చేసినా ట్విట్టర్ మాత్రం నాన్చుతూ వచ్చింది. కేంద్రం నోటీసులు జారీ చేసినా కూడా వెనక్కి తగ్గలేదు. దేశంలో బాధ్యులను నియమించలేదు. దీంతో కేంద్రం సీరియస్ అయ్యి తుది హెచ్చరిక నోటీసులు కూడా ట్విట్టర్ కు జారీ చేసింది. రక్షణను ఉపసంహరించుకుంది. ఇక ట్విట్టర్ కూడా కేంద్రమంత్రులు, ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ఖాతాలను కొద్దిసేపు బ్లాక్ చేసి కేంద్రంతో ఫైట్ కు దిగింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా నిన్నటి దాకా ఉన్న రవిశంకర్ ప్రసాద్ ఖాతానే నిలుపుదల చేసింది.  కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ట్విట్టర్  వ్యవహరించింది.

ఇక కేంద్రంపై ట్విట్టర్ ఏకంగా హైకోర్టుకు ఎక్కింది. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల రాజకీయ నాయులు, సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్టుల పోస్టులు కూడా తీసివేయాల్సి ఉంటుందని.. ఇలా అయితే భారత్ లో తాము వ్యాపారం చేయలేమని హైకోర్టుకు ఎక్కి ఏకంగా మోడీ సర్కార్ తో ఫైట్ కు దిగింది. ఇదే విషయాన్ని తనకు తెలుపలేదని.. మోసం చేశారని ఎలన్ మస్క్ లేవనెత్తారు.
Tags:    

Similar News