కేంద్రంతో ఫైట్: ట్విట్టర్ సంచలన నిర్ణయం

Update: 2021-07-11 07:46 GMT
కొద్దిరోజులుగా కేంద్రప్రభుత్వంతో ఫైట్ చేస్తున్న ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు దిగివచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీవ్ర హెచ్చరికలతో తలొగ్గింది. కేంద్రప్రభుత్వం ఆదేశాలు పాటించేందుకు రెడీ అయ్యింది. తాజాగా ట్విట్టర్ భారత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నియామకం చేపట్టింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను అన్ని సోషల్ మీడియాలు అమలు చేసినా ట్విట్టర్ మాత్రం నాన్చుతూ వచ్చింది. కేంద్రం నోటీసులు జారీ చేసినా కూడా వెనక్కి తగ్గలేదు. దేశంలో బాధ్యులను నియమించలేదు. దీంతో కేంద్రం సీరియస్ అయ్యి తుది హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. రక్షణను ఉపసంహరించుకుంది.

ఇక ట్విట్టర్ కూడా కేంద్రమంత్రులు, ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ఖాతాలను కొద్దిసేపు బ్లాక్ చేసి కేంద్రంతో ఫైట్ కు దిగింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా నిన్నటి దాకా ఉన్న రవిశంకర్ ప్రసాద్ ఖాతానే నిలుపుదల చేసింది.  కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్న ట్విట్టర్ తాజాగా వెనక్కి తగ్గింది.

కొత్త ఐటీ రూల్స్ ప్రకారం.. భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భారతదేశంలో రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్ ను ట్విట్టర్ నియమించింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేసింది. ఇక నుంచి ట్విట్టర్ పై ఫిర్యాదులకు, అభ్యంతరాలకు 'grievance-officer-in@twitter.com' ద్వారా భారతదేశంలోని యూజర్లు ట్విట్టర్ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ 'వినయ్ ప్రకాశ్'ను సంప్రదించవచ్చని ట్విటర్ వెబ్ సైట్లో పేర్కొంది. కొత్త రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసిన మేరకు ఈ నియామకం చేపట్టింది.

ఇక గ్రీవెన్స్ ఆఫీసర్ తోపాటు చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్, నోడల్ అఫీసర్, గ్రీవెన్స్ ఆఫీసర్ లను నియమించాలని తెలిపింది. భారతదేశంలో ట్విట్టర్ ను సంప్రదించవలసిన చిరునామాను కూడా తెలిపింది. 'నాలుగో అంతస్తు, ది ఎస్టేట్, 121 డికెన్సన్ రోడ్, బెంగళూరు, పిన్ -560042'లో వినయ్ ప్రకాష్ ను సంప్రదించవచ్చునని పేర్కొంది. 2021, మే 26 నుంచి జూన్ 25 వరకు కాంప్లియెన్స్ రిపోర్టును కూడా ట్విట్టర్ ప్రచురించింది. ఐటీ రూల్స్ ప్రకారం ఈ నివేదికను ప్రచురించడం కూడా తప్పనిసరి అని ట్విటర్ ఈ పనిచేసింది.

వినియోగదారుల సంఖ్య 5 మిలియన్ల కన్నా ఎక్కువ ఉన్న సోషల్ మీడియా సంస్థలు ఈ ముగ్గురు అధికారులను తప్పనిసరిగా నియమించాలని కేంద్రం ఐటీ రూల్స్ లో పెట్టింది. ఈ అధికారులు భారతదేశంలోనే నివసించాలని పేర్కొంది.

ఇక ఇంతకుముందు ట్విటర్ ధర్మేంద్ర చతుర్ ను తాత్కాలిక రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్ గా నియమించింది. అయితే ధర్మేంద్ర గత నెలలో ఈ పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు ట్విట్టర్ తాజాగా కేంద్రంతో ఫైట్ మాని అధికారిని నియమించి వివాదానికి ముగింపు పలికింది.

- హైకోర్టు హెచ్చరికలతో దిగొచ్చిన ట్విట్టర్
కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను ట్విటర్ ఎందుకు పాటించడం లేదంటూ న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా 'నూతన ఐటీ నిబంధనలను ట్విటర్ ధిక్కారించాలనుకుంటోందా? ' అని ట్విట్టర్ ను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ట్విటర్ దురుసుగా బదులిచ్చింది. 'ఇప్పటివరకు మేం కొత్త నిబంధనలను అమలు చేయలేదు. అయితే ఆ ప్రక్రియను మొదలుపెట్టాం' అని తెలిపింది.  ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించామని.. కానీ ఆయన రాజీనామా చేశారని.. కొత్త గ్రీవెన్స్ అధికారిని నియమించాల్సి ఉందని ట్విటర్ తరుఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం నియామక ప్రక్రియ జరుగుతోందని అన్నారు.

దీనిపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. 'మీ నియామక ప్రక్రియ ఎప్పటికీ పూర్తవుతుంది? మీకు నచ్చినన్ని రోజులు తీసుకుంటాం అంటే కుదరదు. దీనికి న్యాయస్థానం అంగీకరించదు' అని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటిదాకా దేశంలో ట్విటర్ కు ఎలాంటి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. కంపెనీపై కేంద్రానికి చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉందని ట్విటర్ కు షాకిచ్చేలా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. భారత్ లో ట్విటర్ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే ఏం చేయాలో మాకు తెలుసు అని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.  ఈ క్రమంలోనే దెబ్బకు దిగొచ్చిన ట్విట్టర్ దేశంలో గ్రీవెన్స్ అధికారిని నియమిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
Tags:    

Similar News