గవర్నర్ తర్వాతి అడుగు ఎలా ఉండనుంది?

Update: 2017-02-15 05:05 GMT
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికార అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం ఒక కొలిక్కి వస్తుందని అనుకున్నా.. అలాంటిదేమీ జరగలేదు. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో.. తాను సీఎం కావటం ఇప్పట్లో సాధ్యం కాదన్న విషయంపైస్పష్టత వచ్చేయటంతో.. పళని స్వామిని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేస్తూ చిన్నమ్మ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ పళనిస్వామి గవర్నర్ కు లేఖ రాశారు. రాజ్ భవన్ కు తన బలం ఉన్న ఎమ్మెల్యేలందరితోవస్తానని.. పరేడ్ పెడతానని కోరారు. అయితే.. అందుకు ఒప్పుకోని గవర్నర్.. తనను కలిసేందుకు మాత్రం అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల జాబితాను.. వారి సంతకాలతో కలిసి గవర్నర్ కు అందించారు పళనిస్వామి.

ఈ నేపథ్యంలో గవర్నర్ ఏం చేసే అవకాశం ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని డిసైడ్ చేయటంలో కీలకభూమికగా గవర్నర్ మారారు. మరోవైపు.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. మొదట్నించి ఏ ధీమాను అయితే ప్రదర్శించారో.. పన్నీర్ నేటికీ అదే తీరును ప్రదర్శించటం గమనార్హం. దీంతో.. గవర్నర్ ఏం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అంచనాలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ముందున్న ఆప్షన్లు చూస్తే..

1.        ముఖ్యమంత్రి అయ్యేందుకు పోటీ పడుతున్న పన్నీర్.. పళని స్వామిల ఇద్దరిలో ఒకరిని ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. తర్వాత మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా కోరటం. ఈ ఆప్షన్లో గవర్నర్ నిర్ణయం మీద విమర్శలు.. వేలెత్తి చూపించే వీలుంది.

2.        తమ తదుపరి సీఎంను రాష్ట్ర అసెంబ్లీ ఎన్నుకొని తనకు సమాచారం ఇవ్వాలని కోరటం. అదే జరిగితే.. కీలకంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తన బాధ్యతను తగ్గించుకొనేలా వ్యవహరించారన్న విమర్శ వచ్చే వీలుంది.

3.        సభను కొలువు దీర్చి.. రహస్య ఓటింగ్ ద్వారా మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటారో వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయటం. ఈ ఆప్షన్ లో గవర్నర్ వైపు వేలెత్తి చూపించే అవకాశాలు అస్సలు ఉండవు. అంతేకాదు.. తనపై ఎలాంటి మరక లేకుండా వ్యవహరించారన్న పేరును సొంతం చేసుకునే అవకాశం ఉంది.

మరి.. ఈ అప్షన్ ను గవర్నర్ ఎంచుకుంటారా? అంటే.. అవుననే మాట వినిపిస్తోంది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు పళనిస్వామికి ఉన్నట్లు కనిపించినా.. రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో తన పక్షాన నిలిచే వారున్నారన్న మాటను పన్నీర్ చెబుతున్న వేళ.. ఎలాంటి విమర్శలు తలెత్తకుండా ఇరు వర్గాలకు అవకాశం ఇస్తూ.. బ్యాలెట్ పద్దతిలో సీఎంను ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తే సరిపోతుంది. ఇలాంటి విధానాన్ని గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు చేపట్టారు. రాజ్యాంగంలోని 175(2) అధికరణ ప్రకారం.. అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ తో తదుపరి సీఎంను ఎన్నుకోవాల్సిందిగా గవర్నర్ కోరవచ్చు.చివరకు దాన్నే బలపరీక్షగా పరిగణలోకి తీసుకునే వీలుంది. మరి.. తన ముందున్న మూడు ఆప్షన్లలో గవర్నర్ దేనికి మొగ్గు చూపుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News