మొత్తానికి ఆ విషయంలో కేటీఆర్ ను మార్చిన ఘనత కేసీఆర్ దే

Update: 2021-09-03 03:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అయితే.. వీరిద్దరికి సంబంధించిన ఒక విషయంలో తండ్రికొడుకులు ఇద్దరూ తూర్పు పడమర అన్నట్లుగా వ్యవహరిస్తారు. కేసీఆర్ ఎంత పెద్ద ఆస్తికుడన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందుగాళ్లు బొందుగాళ్లు అన్నప్పటికి.. తనకు మించిన హిందువు ఎక్కడ ఉంటాడంటూ రొమ్ములు విరిచినట్లుగా మాట్లాడే కేసీఆర్ కు పూర్తి భిన్నంగా కొడుకు కేటీఆర్ పూర్తిస్థాయి నాస్తికుడిగా చెబుతారు.

అలా అని దేవుడు.. పూజ అంటే అసహ్యించుకోవటం లాంటివి చేయరు కానీ.. గుడికి వెళ్లటం.. పూజలు చేయటం లాంటి వాటిని అస్సలు ఇష్టపడరు. కేసీఆర్ ఇంట్లో ఒక్క కేటీఆర్ మినహా మిగిలిన వారంతా పూజలు.. పునస్కారాలు.. యాగాలు.. ప్రత్యేక పూజలు చేసే విషయంలో ఎంతటి కమిట్ మెంట్ ను ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. పుణ్యక్షేత్రాలకు కేసీఆర్.. ఆయన కుమార్తె కవిత పోటీ పడి మరి తిరుగుతుంటారు.

కానీ.. కేటీఆర్ ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. అంతదాకా ఎందుకు కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటీఆర్ చాలా దూరంగా ఉంటారు. విచిత్రమైన విషయం ఏమంటే.. ఇదే కేటీఆర్ కుమారుడు మాత్రం దేవుడంటే విపరీతమైన భక్తి మాత్రమే కాదు.. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేషుడి వద్దకు ఎంతలా వస్తారో తెలిసిందే. వయసులో చిన్నదే అయినప్పటికి.. పూజల విషయంలో ఎంతటి కమిట్ మెంట్ తో వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

రాజకీయం విషయంలో వంక పెట్టటానికి వీల్లేదు కానీ.. అథ్యాత్మిక విషయాల్లో కేసీఆర్ కు పూర్తి భిన్నంగా కేటీఆర్ వ్యవహరిస్తారు. అందుకు బదులుగా కేటీఆర్ కు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ఆయన కొడుకు హిమాన్షు వ్యవహారశైలి ఉంటుందని చెబుతారు. అలాంటి కేటీఆర్ తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో తన రోటీన్ తీరుకు భిన్నంగా వ్యవహరించారని చెప్పాలి. ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మిస్తున్న టీఆర్ఎస్ కార్యాలయ స్థలంలో భూ వరాహస్వామి యజ్ఞం నిర్వహించారు.

పూర్ణాహుతి కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.48 గంటల వేళలో భూ సంప్రోక్షణ చేసి భూమిపూజ చేశారు. దీనికి గంట ముందు అంటే..మధ్యాహ్నం 12.40 గంటలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రావటానికి కొద్దిసేపు ముందు ఆయన హోమంలో పాల్గొనటం విశేషం. ఇప్పటివరకు ఎప్పుడూ చేయని పూజను మంత్రి కేటీఆర్ తొలిసారి ఢిల్లీలో చేసినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తామెప్పుడూ పూజా కార్యక్రమాల్లో ఇంతలా పాల్గొనటం ఎప్పుడూ చూడలేదన్న మాటను చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News