బొమ్మ చూపించడంలో కేసీఆర్‌ను మించిపోతున్నావయ్యా బుగ్గనా!

Update: 2022-12-06 03:30 GMT
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు వింటుంటే కేసీఆర్ గుర్తొస్తున్నారంటున్నారు కర్నూలు ప్రజలు. రాయలసీమ గర్జన అంటూ కర్నూలు ఎస్టీబీసీ కళాశాల గ్రౌండులో బుగ్గన కోసిన కోతలు విన్న కర్నూలు ప్రజలు ఆయన్ను కేసీఆర్‌తో పోల్చుతున్నారు.

సీమ గర్జన సభలో బుగ్గన మాట్లాడుతూ.. కర్నూలులో కచ్చితంగా హైకోర్టు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు సాధించేంత వరకు ఉద్యమం ఆగదని అన్నారు. యువత, రైతులు, ఈ ప్రాంత భవిష్యత్తు, గౌరవం కోసం హైకోర్టును తీసుకువచ్చేందుకు పోరాటం జరుగుతుందని అన్నారు. అంతవరకు బాగానే ఉంది.. అందరు రాజకీయ నాయకుల మాదిరిగానే మాట్లాడారు.

ఆ తరువాత సడెన్‌గా ఆయనలో కేసీఆర్ పరకాయ ప్రవేశం చేశారు. హైకోర్టు ఎక్కడ కడతామో కూడా చెప్పిన బుగ్గన అది 10 కిలోమీటర్ల దూరం వరకు కనిపించేలా అంతెత్తున కడతామని చెప్పడంతో ఇదేదో అయినట్లే ఉందనుకుంటున్నారు కర్నూలు ప్రజలు. కర్నూలు నుంచి నంథ్యాల వెళ్లే రూట్లో ఉన్న కొండ జగన్నాథ గుట్టపై హైకోర్టు కడతామని, అక్కడ కడితే 10 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుందని బుగ్గన చెప్పారు.


తెలంగాణలో ఎన్నికల ముందు కేసీఆర్ జర్నలిస్టులకు ఇళ్లు కట్టించి ఇస్తామనడం.. అవి ఎలా ఉండబోతున్నాయో కళ్లకు కట్టినట్లు వివరించడం, ఎక్కడ కట్టి ఇస్తామో కూడా చెప్పడం ఇప్పటికీ అక్కడ సెంటిమీటరు పని కూడా జరగకపోవడాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు బుగ్గన కోతలు విన్నవారు.

హైకోర్టు కట్టగలిగితే కట్టాలని.. హైకోర్టు రావడం ప్రధానం కానీ అది 10 కిలోమీటర్ల దూరం కనిపించాల్సిన అవసరం లేదని అంటున్నారు. జగన్ గెలిచిన తరువాత అమరావతిలో అంగుళం పనికూడా జరగలేదు .. విశాఖలో రుషికొండను తవ్వడం తప్ప ఇంకేమీ చేయలేదు.. అలాంటిది కర్నూలులో జగన్నాథగుట్ట మీద హైకోర్టు కడతామంటే నమ్మి తీరాల్సిందే అంటున్నారు. రుషికొండ మాదిరగా జగన్నాథ గుట్టను కూడా ఏం చేస్తారో ఏమో అంటూ టెన్షన్ పడుతున్నవారూ ఉన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News