ప్ర‌పంచ దేశాల ఆర్థిక ప్యాకేజీలు ఎంతెంతంటే..!

Update: 2020-05-22 02:30 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌బ‌లి ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోల‌మైంది. ఆ వైర‌స్ నివార‌ణకు దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ అస్ర్తంగా చేసుకుని త‌మ త‌మ దేశాల‌ను బందీ చేశాయి. ప్ర‌జ‌లంద‌రినీ ఇళ్ల‌కే ప‌రిమితం చేశారు. ఈ క్ర‌మంలో వ్యాపారాలు, కంపెనీలు మూత‌ప‌డ్డాయి. కోటీశ్వ‌రుడి నుంచి కూలీ దాకా ఇంటికే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. దీంతో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌వ‌డంతో పాటు పేద‌ - మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేద‌లు ఉపాధి కోల్పోయి రోడ్డున ప‌డిన ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చాలా దేశాలు తక్ష‌ణ ఉప‌శ‌మ‌నంగా ఆర్థిక ప్యాకేజీలు ప్ర‌క‌టించాయి. భార‌త‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ప్యాకేజీలు ప్ర‌క‌టించారు. ఈ మాదిరి ప్ర‌పంచ‌ దేశాలు కూడా త‌మ ప్ర‌జ‌ల‌కు ప్యాకేజీని ప్ర‌క‌టించి కొంత కోలుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

అయితే ఈ ప్యాకేజీల‌న్నీ ప్ర‌జ‌ల‌కు కాదు పెట్టుబ‌డిదారులు - కంపెనీల య‌జ‌మానుల‌కు ల‌బ్ధి పొందేలా ఉన్నాయ‌ని ఆర్థిక‌వేత్త‌లు, మేధావులు చెబుతున్న మాట‌. ప‌రిస్థితి అలానే ఉంది. ఎందుకంటే ప్ర‌భుత్వాల‌న్నీ వ్యాపార‌, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అండ‌గానే ఉంటాయి. ఇది వాస్త‌వం. ప్ర‌పంచ‌దేశాలు ప్ర‌క‌టించిన ప్యాకేజీల‌న్నింటిని ప‌రిశీలిస్తే ఇదే విష‌యం అర్థ‌మ‌వుతోంది. భార‌త‌దేశ ప్యాకేజీ కూడా అంతే. ఈ లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏయే దేశాలు ఎంత ప్యాకేజీ, దేనికి ఎంత కేటాయించాయో ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

చైనా
మ‌హ‌మ్మారికి జ‌న్మ‌నిచ్చిన దేశం చైనా. ఆ వైర‌స్‌ తో తీవ్రంగా ప్ర‌భావిత‌మైన తొలి దేశం ఇదే. వైర‌స్ నివార‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో భాగంగా దేశాన్ని దిగ్బంధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌రిస్థితి కొంత అదుపులోకి వ‌చ్చింది. ఇప్పుడు దేశాన్ని మ‌ళ్లీ గాడీన పెట్టేందుకు భారీ ప్యాకేజీ ఆ దేశం ప్ర‌క‌టించింది. జీడీపీలో 2.5 శాతాన్ని (34 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.25.5 లక్షల కోట్లు. దీనిలో రూ.12 లక్షల కోట్ల మేర ఉద్దీప‌న చర్యలను ఇప్పటికే ప్రారంభించింది. మరో రూ.13 లక్షల కోట్ల మేర లోకల్‌ బాండ్లను కొనుగోలు చేసి దేశాన్ని సాధార‌ణ స్థితికి తెచ్చేలా చైనా కృషి చేస్తోంది.  రూ.32 లక్షల కోట్ల మేర వ్యవస్థలోకి నగదు పంపి లిక్విడిటీని పెంచింది. రుణాలున్న వారికి కొత్త రుణాలివ్వటానికి, రీ- డిస్కౌంట్‌ చేయడానికి మరో రూ.17 లక్షల కోట్లు కేటాయించింది. పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఏకంగా 1.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ విధంగా మొత్తం క‌లిపితే ఏకంగా వంద ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీగా చెప్ప‌వ‌చ్చు.

అమెరికా

ప్ర‌స్తుతం ఆ వైర‌స్‌తో చిగురుటాకులా వ‌ణుకుతున్న దేశం అమెరికా. కేసులు ల‌క్ష‌ల్లో.. మృతులు వేల‌ల్లో ఉన్న విష‌యం తెలిసిందే. ఆ వైర‌స్‌ ను క‌ట్ట‌డి చేయ‌లేక ప్ర‌భుత్వం చేతులెత్తేసింది. ఈ క్ర‌మంలో దేశాన్ని ర‌క్షించుకునేందుకు భారీ ప్యాకేజీ ప్ర‌క‌టించింది. పే–చెక్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రామ్, ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి జీడీపీలో 2.3 శాతాన్ని (50 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. అంటే రూ.37.5 లక్షల కోట్లు. కంపెనీలు మూతబడే ప్రమాదాన్ని తప్పించడానికి ఆ కంపెనీ ఉద్యోగుల 8 వారాల జీతాన్ని ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. ప్ర‌జ‌ల ఆర్థిక సహకారానికి 2 లక్షల కోట్ల డాలర్ల (రూ.150 లక్షల కోట్లు) ప్యాకేజీకి ఆమోదం ల‌భించింది. ఏప్రిల్‌ 2 నుంచి డిసెంబర్‌ 31 మధ్య కరోనా వైరస్‌ బారినపడి సెలవులు పెట్టుకున్నవారికి పెయిడ్‌ లీవ్‌ ఇచ్చేందుకు మరో 20.5 వేల కోట్ల డాలర్లు (రూ.15.35 లక్షల కోట్లు) కేటాయించింది. ఫెడరల్‌ రిజర్వు బ్యాంకులకు తానిచ్చే సొమ్ముపై వసూలు చేసే వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది. ఇది ఏకంగా 1.5% తగ్గించడంతో ప్రస్తుతం వడ్డీ రేటు 0.25 శాతమే.

జపాన్

శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో అగ్ర‌గామి దేశంగా జ‌పాన్ ఉంది. అతి చిన్న దేశ‌మైనా అభివృద్ధి చెందిన దేశంగా పేరు గాంచింది. ఈ దేశం కూడా ఆ వైర‌స్ బారిన ప‌డి తీవ్రంగా న‌ష్ట‌పోయింది. దీంతో నివార‌ణ చ‌ర్య‌లు ప్రారంభించింది. జీడీపీలో అత్యధికంగా 21.1 శాతాన్ని అత్యవసర ఆర్థిక ప్యాకేజీగా జ‌పాన్ ప్రకటించింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.80 లక్షల కోట్లు. అయితే వీటిలో ప్ర‌జ‌ల‌కు అందేది చాలా త‌క్కువ మొత్తంలోనే. ఎందుకంటే ఆ ప్యాకేజీలో రూ.60 లక్షల కోట్లను వ్యాపారాలు, ఉద్యోగాల్ని రక్షించుకోవటానికే వినియోగించాల‌ని నిర్ణ‌యించింది. చిన్న వ్యాపారాలకు రాయితీలపై రుణాలు అందిస్తోంది. లిక్విడిటీని మెరుగుపరచటానికి ప్రభుత్వ బాండ్ల సంఖ్యను పెంచటం, ఎక్కువ సార్లు జారీ చేయటం వంటి చర్యలు జ‌పాన్ తీసుకుంది.

జర్మనీ

ఆ మ‌హ‌మ్మారి వైర‌స్‌తో తీవ్రంగా ప్ర‌భావిత‌మైన దేశాల్లో జ‌ర్మ‌నీ కూడా ఒక‌టి. తన జీడీపీలో 10.7 శాతాన్ని (40 వేల కోట్ల డాలర్లు) ఆర్థిక ప్యాకేజీగా జ‌ర్మ‌నీ కేటాయించింది. అంటే మన కరెన్సీలో రూ.30 లక్షల కోట్లు అన్న‌మాట‌. దీనిలో సగానికి స‌‌గం స్వల్పకాలిక పనులకు, ఉద్యోగాలను కాపాడటానికి వినియోగించాల‌ని ఆ దేశం నిర్ణ‌యించింది. మిగ‌తా స‌గం ప్ర‌జ‌ల‌కు వెచ్చించింది. వివిధ వర్గాలకిచ్చే రుణాలను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 23 శాతానికి పెంచేలా ప్రభుత్వ గ్యారంటీలను వినియోగించేలా చ‌ర్య‌లు తీసుకుంది. దీంతోపాటు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్యాకేజీలు ప్ర‌క‌టించాయి.
Tags:    

Similar News