నయాదేశ భక్తుల్లారా మోడీ సారు పని చూశారా?

Update: 2021-11-18 11:30 GMT
తప్పును తప్పుగా చూడటం. ఒప్పును ఒప్పు అని ఒప్పుకోవటం లాంటి రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ఏమైనా సరే.. మనం మద్దతు ఇచ్చేటోడికి వెనుకా ముందు చూసుకోకుండా మద్దతు ఇవ్వాల్సిందే. ఎలాంటి పని చేసినా అండగా నిలవాల్సిందే.

వేలెత్తి చూపించే వాడి కంటిని పొడవాలన్నట్లుగా మారుతోంది అభిమానం. రాజకీయ నేతల్ని అభిమానించే తీరు గతంతో పోలిస్తే ఇప్పుడు ముదిరి పాకాన పడుతోంది. అలాంటి వారంతా అవాక్కు అయ్యే విషయం బయటకు వచ్చింది. ఒకటి కాదు రెండుకాదు.. ఏకంగా రూ.8లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన ఉదారత మోడీ సర్కారుదే.

మోడీని అభిమానించి.. ఆరాధించే వారి గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అందులోని లోపాల్ని ఎత్తి చూపినంతనే దేశభక్తి కోణాన్ని బయటకు తీసే కొత్త అలవాటు మోడీ భక్తుల్లో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గతంలో పెట్రోల్.. డీజిల్ మీద లీటరుకు అర్థరూపాయి పెంచితే ఆగమాగమయ్యే ప్రజలకు భిన్నంగా.. వందను దాటించేసినా కూడా కిమ్మనకుండా ఉండాలని చెప్పటం.. అదంతా దేశభక్తిలో భాగమని వాదించటం.. పెట్రో బాదుడుతో వచ్చే ఆదాయాన్ని ఆయుధాల్ని కొంటున్నారు తెలుసా? లాంటి వితండ వాదాన్ని వినిపించటమే కాదు.. అసలు టూవీలర్లు ఎందుకు వాడాలి? అంటూ అనాగరిక వ్యాఖ్యలు చేసే బీజేపీ నేతల దండు మాటలకు.. జరిగేదానికి సంబంధం లేదన్న వాదనను పలువురు వినిపిస్తుంటారు.

ఇక.. తాజాగా ఒక సమాచారహక్కు కార్యకర్త ఒకరు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్యాంకులు మాఫీ చేసిన అప్పుల లెక్క గురించి వివరాల్ని అడిగారు. నిరర్ధక అప్పులపై సమాచారం ఇవ్వాలని కోరగా.. అందుకు స్పందించిన సంబంధిత శాఖ వివరాల్ని బయటకు వెల్లడించింది. 2004 నుంచి 2014 పదేళ్ల యూపీఏ హయాంలో రూ.2,20,328 కోట్ల పాత బకాయిల్ని మాఫీ చేసినట్లుగా పేర్కొన్నారు.

ఇక.. మోడీ అధికారంలో ఉన్న నాలుగేళ్ల కాలంలో (2015-19) ఏకంగా రూ.7,94,354 కోట్ల నిరర్ధక అప్పుల్ని గుర్తించి మాఫీ చేసినట్లుగా పేర్కొన్నారు. మరి.. ఇంత భారీగా అప్పుల్ని మాఫీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇంతకూ వారెవరు? అంత భారీఎత్తున అప్పుల కింద తీసుకున్న మొత్తాన్ని ఏం చేశారు? అన్నవి ప్రశ్నలే. వాస్తవాల్ని ప్రశ్నించే వారి మీద దేశభక్తి పేరిట విరుచుకుపడే నయా దేశ భక్తులు మోడీ కాలంలో చేసిన ఈ భారీ మాఫీ మీద ఏమంటారు?


Tags:    

Similar News