దేశం కోసం ప్ర‌ధానికి ఫైర్ బ్రాండ్ మ‌మ‌త మ‌ద్ద‌తు

Update: 2020-06-20 03:18 GMT
సరిహ‌ద్దు వివాదం చైనాతో తీవ్ర రూపం దాల్చింది. రెండు వారాలుగా ఈ వివాదం రాజుకుంటూ సైనికుల ఘ‌ర్ష‌ణ‌తో ఉద్రిక్తంగా మారింది. భార‌త సైనికులు 20 మందిని కోల్పోయిన ప‌రిస్థితి. ఇలాంటి ఉద్రిక్త స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి దాదాపు 20 పార్టీల అధినేత‌లు హాజ‌ర‌య్యారు. వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో నాయ‌కులంతా వీడియో కాన్ఫ‌రెన్స్‌ల‌లో పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో అంద‌రి దృష్టి ఫైర్‌బ్రాండ్ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపైనే ప‌డింది.

ఎందుకంటే ఈ వైర‌స్ స‌మ‌యంలోనూ మ‌మ‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, కేంద్ర ప్ర‌భుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. రాజ‌కీయంగా ప్ర‌ధాన శ‌త్రువుగా బీజేపీని ఆమె భావిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఆమె పాల్గొంటారా లేదా అనే చ‌ర్చ సాగింది. చివ‌ర‌కు ఆమె స‌మావేశంలో పాల్గొన‌డంతో ఉత్కంఠ వీడింది.

అయితే ఈ స‌మావేశంలో మ‌మ‌తా బెన‌ర్జీ కేంద్ర ప్ర‌భుత్వానికి బాస‌టగా నిలిచారు. మొద‌ట దేశం ఆ త‌ర్వాత రాజ‌కీయం అనే విధానంలో మ‌మ‌తా బెన‌ర్జీ కేంద్ర ప్ర‌భుత్వం క‌లిసి ప‌ని చేస్తామ‌ని, కలిసికట్టుగా ఉంటామని స్ప‌ష్టం చేశారు. సమావేశంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ప్రసంగించిన అనంత‌రం మమతా బెనర్జీ మాట్లాడారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద చైనా ప్రవర్తించిన తీరు సరికాదు అని ఖండించారు. నియంతృత్వ వైఖరితో ముందడుగు వేయడం సరికాదు అని కేంద్రానికి హెచ్చ‌రిస్తూనే సున్నిత సూచ‌న చేశారు. ఈ సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండాలని ఐక్య‌తా రాగం వినిపించారు. ఒక్కటై పోరాడితే భారత్‌దే విజయం అని.. చైనా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్య‌క్తం చేశారు. మనమంతా ఓకే మాట, ఓకే ఆలోచనలతో, ఐకమత్యంగా ఉండాలని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలని ఈ సంద‌ర్భంగా మ‌మ‌తా బెన‌ర్జీ కోరారు. చైనా దుశ్చర్య తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించడం దేశానికి మంచి సందేశం ఇస్తోందని అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో ఉన్న జవాన్ల వెనక.. మనమంతా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్ర‌క‌టించారు. చైనా పరికరాలు టెలికాం, రైల్వే, విమానయాన రంగాల్లో వాడొద్దని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో చైనా వస్తువులను వాడొద్దు అని సూచించారు.
Tags:    

Similar News