తాలిబన్లపై ఆ దేశ తొలి మహిళా పైలట్ సంచలన వ్యాఖ్యలు..

Update: 2021-08-19 11:30 GMT
ఆప్ఘనిస్తాన్ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తాలిబన్లు కూల్చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా, ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే దేశం నుంచి పారిపోయేందుకుగాను కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవల కాలంలో విమానాల కోసం ఎదురు చూసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఇక దేశంలో మహిళలపై ఆంక్షలు షురూ అయ్యాయి. ఇప్పటి వరకుస్వేచ్ఛగా దేశంలో తిరిగిన మహిళలు ప్రస్తుతం బుర్ఖాలు ధరించడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే తమకు భద్రత కరువైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిరసన కారులను చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరిపిన తాలిబన్లు ఈ నేపథ్యంలోనే ముగ్గురు పౌరులను కాల్చేశారు. ఇప్పటిదాకా ఫ్రీగా రిపోర్టింగ్, యాంకరింగ్ చేసిన మహిళా జర్నలిస్టులు తాలిబన్లకు భయపడిపోయి బుర్ఖాలు ధరిస్తున్నారు. ఈ క్రమంలోనే కాబుల్‌లో ఎన్నడూ లేనంతగా బుర్ఖాలు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఆప్ఘానిస్తాన్‌లో తాలిబన్లపై ఆ దేశ తొలి మహిళా పైలట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటలు వింటే చాలు.. ఆ దేశంలో ప్రస్తుతం ఎంతటి ఆరాచక పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుంది. ఆప్ఘాన్ పరిస్థితిపై మహిళా పైలట్ నీలోఫర్ రెహమాన్ తాజాగా మీడియాతో ముచ్చటించింది.

తాలిబన్లు మహిళల హక్కులు, స్వేచ్ఛను కాలరాస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. మహిళల పట్ల వివక్ష చూపబోమన్న తాలిబన్ల మాటలను అస్సలు నమ్మొద్దని ఆఫ్గన్ మహిళలను నీలోఫర్ హెచ్చరిస్తోంది. తాలిబన్లు మహిళల హక్కులు, స్వేచ్ఛను కాలరాస్తారని, చిత్రహింసలు పెట్టి చంపుతారని మహిళా పైలట్ ఆందోళన వ్యక్తం చేసింది. తాను పైలట్ కావడానికి సహకరించిన కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

తన కుటుంబీకులను తాలిబన్లు ప్రాణాలతో ఉండబోనివ్వరంటూ ఆమె బోరున విలపించింది. ఆప్ఘాన్ దేశంలో ప్రస్తుతం ఆరాచక పాలన సాగుతున్నదన్న సంగతిని అంతర్జాతీయ సమాజం పరిశీలిస్తోంది. అయితే, తాలిబన్లు ప్రకటనలు చూస్తే మాత్రం తాము ప్రజాస్వామికంగా వ్యవహరిస్తామన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే, మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదన్న సంగతి అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తే అర్థమవుతుంది. ఆప్ఘాన్‌లో మొత్తంగా వారు విధ్వంసమే సృష్టిస్తున్నారు.

బుర్ఖా ధరించలేదని ఓ మహిళను నడిరోడ్డుపైనే కాల్చిచంపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వీడియోలో బ్యూటీ పార్లర్‌ను ధ్వంసం చేసి మహిళల ఫొటోలు తొలగించారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు ఆరాచకాలు ఇంకెంత కాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితులున్నాయి. దీంతో దేశంలో ఉన్న వారు సైతం దేశాన్ని విడిచి వెళ్లిపోవాలనే ఆలోచనల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆప్ఘన్ రేడియో అండ్ టెలివిజన్‌లో పని చేస్తున్న సీనిరయ్ మహిళా ఉద్యోగి షబ్నమ్‌ను తాలిబన్లు ఉద్యోగం నుంచి తొలగించేశారు.

పాలన మారినందును ఇక ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదని ఆమెకు తెలిపారు. దీంతో షబ్నమ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాడుతానని, తనకు మద్దతు తెలపాలంటూ మహిళా జర్నలిస్టు షబ్నమ్ ప్రజలను కోరింది. కాగా, ఈ రేడియో అండ్ టెలివిజన్‌ను ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం నడుపుతోంది. ఈ చానల్‌లో గత కొద్ది రోజుల నుంచి తాలిబన్లకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చానల్‌ను కంప్లీట్‌గా తమ హ్యాండ్ ఓవర్‌లోకి తీసుకున్నారు తాలిబన్లు.




Tags:    

Similar News