కేసీఆర్ కు కొత్త చిక్కులు..: రిజర్వేషన్ల నిర్ణయం పై ఉత్కంఠ

Update: 2022-09-26 07:39 GMT
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేసీఆర్ కొత్త చిక్కులు తలకెక్కించుకుంటున్నాడు. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్న తప్పులను ప్రతిపక్షాలు ఆధారాలతో సహా బయటపెట్టడంతో ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నా.. ఆవి పోను పోనూ తాచుపాముల మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల బంజారా భవన్ ప్రారంభం సందర్భంగా కేసీఆర్ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతున్నామని హామీ  ఇచ్చారు. వారం రోజుల్లో జీవో జారీ చేస్తామని కూడా ప్రకటించారు. కానీ పది రోజులవుతున్నా.. అందుకు సంబంధించిన అలజడి ఏమీ కనిపించడం లేదు. అయితే ఎస్టీలకు రిజర్వేషన్ల జీవో జారీ చేస్తే ముస్లిం వర్గాలతో పాటు ఇతరులు కూడా రిజర్వేషన్లు పెంచాలని ఆందోళన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రిజర్వేషన్ విషయంలో కొత్త తలనొప్పి తెచ్చుకున్నారని  అంటున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎస్టీ, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ముస్లింలకు ఇప్పుడున్న 4 శాతం నుంచి 10 శాతానికి, ఎస్టీలకు 6 నుంచి 10 శాతానికి పెంచుతామని తెలిపారు. ఇందుకు సంబంధించి 2017లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. కనీసం దీని గురించి పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఆయన ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తమ రిజ్వేషన్ల సంగతేంటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఎంఐఎం కొనసాగుతోంది. దీంతో కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ల పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేసీఆర్ హిందు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో ముస్లిం రిజర్వేషన్లు పెంచితే ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం కేంద్రంతో సంబంధం లేకుండా జీవో జారీ చేసి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం తీర్పు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇటీవల ఎస్టీ రిజర్వేషన్లపై హామీ ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మిగతా వర్గాలు సైతం తమ రిజర్వేషన్లు పెంచాలని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మరో వైపు ప్రతిపక్షాలకు.. ముఖ్యంగా బీజేపీకి ఇది మంచి అస్త్రంగా భావించే అవకాశం ఉంది. ఈ పరిణామాల్లో కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోనని టీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

అటు మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు  ఎక్కువగా ఉన్నాయని బీజేపీ అంటోంది. అయితే సచివాలయానికి అంబేడ్కర్ పేరంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఇప్పటి వరకు ఎస్టీ, ముస్లిం వర్గాలను రిజర్వేషన్లతో ఒప్పించి.. సచివాలానికి అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల ఆ వర్గాన్ని చల్లార్చొచ్చు అనుకుంటున్నారు. కానీ అంతటితో సమస్య ముగిసిపోతుందా..? అనేది తేలాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News