అలా కాని జరగకుంటే యువరాజు పని అంతేనట

Update: 2017-03-07 07:52 GMT
తొలిసారి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇప్పుడాయన పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన రాజకీయ భవిష్యత్తును ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయనటంలో సందేహం లేదు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కనీసం రెండు రాష్ట్రాల్లో అయినా కాంగ్రెస్ పవర్ లోకి రాకుంటే మాత్రం రాహుల్ కు గడ్డుకాలం తప్పదని చెబుతున్నారు.

ఒకవేళ ఇప్పుడున్న అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైతే మాత్రం.. ఆయన రాజకీయ భవితవ్యం మీద సందేహాలు వ్యక్తమైనట్లేనని చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే ప్లీనరీ నిర్వహించి కాంగ్రెస్ పగ్గాలు ఆయన చేతికి అప్పజెప్పాలని అనుకున్నారు. అయితే.. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆయన మీద పడకుండా ఉండేందుకు వీలుగా..ప్లీనరీని వాయిదా వేసినట్లుగా చెప్పాలి.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. ఫలితానికి తగ్గట్లు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే విషయంలో ఆసక్తికర పరిణామాలకు దారి తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్నారాహుల్ తన మార్క్ ను ప్రదర్శించలేకపోతున్నారన్న అసంతృప్తి కాంగ్రెస్ సీనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది. కొందరైతే.. తమ మనసులోని మాటను బయటకు చెప్పేయటాన్నిమర్చిపోకూడదు.

రాహుల్ కు ప్రత్యామ్నాయంగా ఆయన సోదరిని పార్టీలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. యూపీ ఎన్నికల్లో ఎస్పీతో జత కట్టే విషయంలో ప్రియాంక కీలకపాత్ర పోషించటాన్ని మర్చిపోకూడదు. కానీ. ఆమె తన పాత్రను ఇరుపార్టీల మధ్య పొత్తు కుదర్చటానికి మాత్రమే పరిమితం చేశారు. మరోవైపు అనారోగ్యం కారణంగా ఐదురాష్ట్రాల ఎన్నికల అంశంలో పార్టీ అధినేత్రి సోనియా దూరంగా ఉండటంతో.. ఎన్నికల ఫలితాలు మొత్తం రాహుల్ దే బాధ్యత అన్నట్లుగా పరిస్థితి మారింది.

ఇదిలా ఉంటే.. రాహుల్ తన ఆశలన్నీ పంజాబ్.. ఉత్తరాఖండ్ మీద పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. సిద్ధూ ఎంట్రీ.. బీజేపీ.. అకాలీల మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఇదంత తేలికైన విషయం కాదన్న వాదన వినిపిస్తోంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో ప్రభావం చూపించటం ఖామయని.. అది చీల్చే ఓట్ల మీదనే తుది ఫలితం ఆధారపడి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఆప్ చీల్చే ఓట్లు తమకు లాభంగా మారతాయే కానీ నష్టం చేయమన్న ధీమాను కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది.

ఇక.. రాహుల్ అండ్ కో రెండో ఆశ.. ఉత్తరాఖండ్ గా చెబుతున్నారు. రాష్ట్రపతి పాలనను విధించటం ద్వారా మోడీ తన గొయ్యి తానే తవ్వుకున్నారని.. హరీశ్ రావత్ బాహుబలి తీరులో కాంగ్రెస్ ను కాపాడతారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవే.. కాంగ్రెస్ పెద్దలు అనుకున్నట్లుగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. ఆ క్రెడిట్ ను రాహుల్ ఖాతాలోకి జమ చేసి.. వెంటనే పార్టీ పగ్గాలు అప్పజెప్పేయటం ఖాయమని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే.. ఎస్పీతో పొత్తు వర్క్ వుట్ అయినా కాకున్నా.. కనీసం పాతిక నుంచి 30 సీట్ల మధ్యలో కాంగ్రెస్ సాధిస్తే గౌరవప్రదంగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో గెలిచి.. యూపీలో ఒకమోస్తరు సీట్లు చేజిక్కించుకున్నా రాహుల్ కు సరిపోతుందని చెబుతున్నారు. మరి.. రాహుల్ ఫ్యూచర్ ను డిసైడ్ చేసే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News