ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం...ఏపీ భవిష్యత్తుకు కీలకమైన ప్రత్యేక హోదాను సాధించేందుకు....ఇంకో ఏడాది కాలం పాటు పదవీ కాలం ఉండగా...వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడమే కాకుండా...తమ రాజీనామాలను ఆమోదించాలంటూ..వారు పట్టుబట్టి మరీ ఆమోదించుకున్న తీరు... ఈ ఆసక్తికి కారణం అయింది. పట్టుబట్టి మరీ తమ రాజీనామాలను వైసీపీ ఎంపీలు ఆమోదం పొందించుకున్న నేపథ్యంలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న ఇచ్చిన రాజీనామాలు ఆమోదం పొందాయి. ఎంపీ పదవులకు రాజీనామా చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలు సమర్పించిన లేఖలు ఆమోదం పొందినట్లు స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఏప్రిల్ ఆరో తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహజన్ ను ఎంపీలు కోరారు. రెండుసార్లు జరిగిన సమావేశాల్లో రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్ సుమిత్రా మహజన్ సూచించినప్పటికీ తాము రాజీనామాలకే కట్టుబడినట్లు ఎంపీలు పేర్కొన్నారు.
కాగా, ప్రత్యేక హోదా కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాల గురించి తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో విమర్శలు చేస్తోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం పలు రకాల కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటం ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఎంపీ పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.
కాగా, ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేసిన త్యాగం వృథాపోదని - ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తమకు అత్యంత ప్రాధాన్యమని భావించి పదవులకు రాజీనామాలు చేసి వాటి ఆమోదానికి హామీ పొందిన మా ఎంపీలంటే గర్వ కారణంగా భావిస్తున్నాను. మీ త్యాగం వృథాపోదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది’ అని జగన్ తన ట్వీట్ లో ఎంపీలను అభినందించారు.