ఈసారి ప్ర‌కృతి టార్గెట్‌.. ఫ్లోరిడా

Update: 2017-09-06 07:26 GMT
ఇప్పుడున్న త‌ల‌నొప్పులు స‌రిపోవ‌న్న‌ట్లు అమెరికా ప్ర‌జ‌ల‌కు ప్ర‌కృతి నుంచి కూడా స‌రైన స‌హ‌కారం అంద‌టం లేదు. మొన్న‌టికి మొన్న హార్వీ హ‌రికేన్ దెబ్బ‌కు అమెరికాలోని టెక్సాస్ ఎంత‌గా అత‌లాకుత‌ల‌మైందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. దాదాపుగా కోటిన్న‌ర మందికి పైగా ప్ర‌జ‌లు తీవ్రంగా ప్ర‌భావిత‌మైన హార్వీ హ‌రికేన్ నుంచి అమెరికా ఇంకా కోలుకోలేదు.

ఇదిలా ఉంటే..తాజాగా మ‌రో హ‌రికేన్ అమెరికాను వ‌ణికిస్తోంది. ఈసారి ఇర్మా పేరుతో ప్ర‌కృతి అమెరికాను టార్గెట్ చేసింద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అగ్ర‌రాజ్యంలోని ఫ్లోరిడాను ప్ర‌భావితం చేసేలా ఇర్మా హ‌రికేన్ దూసుకొస్తుంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు.

అట్లాంటిక్ స‌ముద్రంలో అతి తీవ్ర పెను తుపాను త‌లెత్తింద‌ని.. గ‌డిచిన కొద్ది గంట‌ల్లో ఇది ఉధృతంగా మారింద‌ని చెబుతున్నారు. దీనికి ఇర్మా అన్న పేరును పెట్టారు. ఈ హ‌రికేన్ ఫ్లోరిడా వైపు వేగంగా క‌దులుతున్న‌ట్లు చెబుతున్నారు. ఆదివారం తెల్ల‌వారుజామున ఈ హ‌రికేన్ తీరాన్ని దాటుతుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఐదో కేట‌గిరిగా అంచ‌నా వేస్తున్న ఈ హ‌రికేన్ కార‌ణంగా గంట‌కు సుమారు 280 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌న్న అంచ‌నాను వేస్తున్నారు.

ఇప్ప‌టికే ఇర్మాన్ ప్ర‌భావంతో విర్జిన్ దీవులు.. పెర్టోరికో.. క‌రేబియ‌న్ దీవులైన అంటిగ్వా.. బార్బ‌డోస్ ల‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించారు. హార్వీ ధాటికి దాదాపు 50 మంది మృత్యువాత ప‌డ‌గా.. ల‌క్ష‌లాది మంది తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యారు. హార్వీ చేదు అనుభ‌వం నుంచి ఇంకా బ‌య‌ట‌కు రాక ముందే.. మ‌ళ్లీ ఇర్మా పేరుతో వ‌స్తున్న హ‌రికేన్ ఫ్లోరిడా ప్రాంత ప్ర‌జ‌ల్ని విప‌రీత‌మైన భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తుంది. మ‌రి.. అమెరికా ప్ర‌జ‌ల్ని ఇర్మా ఏం చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News