ఆర్మీ వీడియోలే ఫ్లోరిడా కాల్పుల‌కు కార‌ణమ‌ట‌

Update: 2017-01-07 06:05 GMT
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్ర‌యంలో కాల్పుల‌కు దిగిన అనుమానితున్ని అరెస్టు చేశారు. కాల్పులు జ‌రిపిన అనుమానితున్ని 26 ఏళ్ల ఎస్టిబాన్ శాంటియాగోగా గుర్తించారు. అత‌ను ఇరాక్ యుద్ధంలో సైనికుడిగా ప‌నిచేశాడు. ఆగంత‌కుడు శాంటియోగో మాన‌సికంగా అస్థిరంగా ఉన్న‌ట్లు అమెరికా మీడియా వెల్ల‌డించింది. ప్ర‌భుత్వం త‌న‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంద‌ని, ప‌దే ప‌దే జిహాదీ వీడియోల‌ను చూపించ‌డం వ‌ల్లే మాజీ సైనికుడు శాంటియాగో ఇలా త‌యారైన‌ట్లు తెలుస్తున్నది.

ఫోర్ట్ లాడెర్‌ డేల్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో ఉన్న ట‌ర్మినెల్ 2 ద‌గ్గ‌ర ప్ర‌యాణికులు ల‌గేజీ తీసుకుంటున్న‌ప్పుడు శాంటియాగో కాల్పుల‌కు తెగించాడు. అక‌స్మాత్తుగా గ‌న్ తీసిన అత‌ను విచ‌క్షణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఆయుధ సామ‌ర్థ్యం త‌గ్గిన త‌ర్వాతే అత‌ను లొంగిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు. స్టార్‌ వార్స్ టీష‌ర్ట్ ధ‌రించిన శాంటియోగా అల‌స్కా నుంచి వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. అన్‌ లోడెడ్ గ‌న్‌ తో వ‌చ్చిన అత‌ను బాత్‌ రూమ్‌ లోకి వెళ్లి దాన్ని లోడ్ చేశాడ‌ని, ఆ త‌ర్వాత ల‌గేజీ పిక‌ప్ ద‌గ్గ‌రకు వ‌చ్చిన త‌ర్వాత కాల్పుల‌కు దిగిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ప్యూర్టోరికా - అల‌స్కా నేష‌న‌ల్ గార్డ్‌ లో గ‌తంలో ప‌నిచేశాడత‌ను. అత‌ని ద‌గ్గ‌ర మిలిట‌రీ ఐడీ కూడా ఉంది.  తాజాగా విమానాశ్రయంలో జ‌రిగిన కాల్పుల్లో అయిదుగురు మృతిచెందారు. మ‌రో ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు. గ‌త ఏడాది ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒర్లాండో నైట్‌ క్ల‌బ్‌ పై జ‌రిగిన దాడిలో 49 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News