ఫామ్ హౌస్ లో కన్నుమూసిన ప్రజాగాయకుడు

Update: 2023-06-29 10:19 GMT
తెలంగాణ ఉద్యమం వేళ.. తన పాటతో కదిలించిన అతడిక లేడు. ఉద్యమ సమయంలో తన పాటలతో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి.. జానపద పాటలతో పలుటీవీ షోలతో సందడి చేసి.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ కు ఛైర్మన్ గా నియమితులైన 39 ఏళ్ల సాయి చంద్ హఠాన్మరణం చెందారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన ఆయనకు అర్థరాత్రి వేళలో గుండెపోటు రావటంతో ఆయన్నుహుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు.

నాగర్ కర్నూలు జల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫాంహౌస్ కు సాయి చంద్.. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అప్పటివరకు బాగానే ఉండి.. రాత్రి వేళ డిన్నర్ ను పూర్తి చేసిన ఆయన.. అర్థరాత్రి సమయంలో హటాత్తుగా గుండె పోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకురాగా.. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు గుర్తించారు.

సాయి చంద్ కు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగానూ ఆయన కనిపించారు. చిన్న వయసులోనే చోటు చేసుకున్న ఆయన మరణం షాకింగ్ గా మారింది.

గతంలో సాయి చంద్ కు ఎలాంటి గుండె సమస్యలు లేవని.. అనారోగ్య సమస్యలు కూడా లేవని.. రాత్రి వేళ భోజనం చేసిన తర్వాత కూడా బాగానే ఉన్నారని.. హటాత్తుగా అనారోగ్యం పాలు కావటం.. ఆ వెంటనే ప్రాణాలు విడవటం జీర్ణించుకోలేనిదిగా మారింది.

గుండెపోటుకు గురైన వెంటనే నాగర్ కర్నూలు గాయత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అప్పటికే మరణించినట్లుగా చెబుతున్నారు. అయినప్పటికీ సాయి చంద్ సతీమణి రజనీ కోరిక మీదకు గచ్చిబౌలిలోని కేర్ కు తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మరణించిన విషయాన్ని అక్కడి వైద్యులు కూడా నిర్దారించారు.

సాయి చంద్ ఆకస్మిక మరణంపై మంత్రి కేటీఆర్ దిగ్భాంత్రికి గురయ్యారు. సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి.. బీఆర్ఎస్ కు తన గొంతుతో ఎనలేని సేవల్ని చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News