క‌రోనా వ్యాక్సిన్ కోసం.. పొరుగు దేశం వెళ్తున్న భారతీయులు!

Update: 2021-04-18 23:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ భార‌త‌దేశాన్ని వ‌ణికిస్తోంది. ల‌క్షలాదిగా న‌మోద‌వుతున్న కేసులు.. ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఇటు చూస్తే.. దేశంలో క‌నీసం ప‌ది ప‌న్నెండు శాతం మందికి కూడా వ్యాక్సిన్ అంద‌లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి మంద‌గించింద‌ని ఏకంగా సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో ట్విట‌ర్ వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొవిడ్ వ్యాక్సిన్ కోసం భార‌తీయులు పొరుగు దేశం వెళ్తున్నార‌న్న వార్త సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

ఇండియాలో అందుబాటులో లేని క‌రోనా వ్యాక్సిన్ కోసం నేపాల్ వెళ్తున్నార‌ట చాలా మంది భార‌తీయులు! నేపాల్-భార‌త స‌రిహ‌ద్దుల్లో పెద్ద‌గా క‌ఠిన ఆంక్ష‌లు ఏమీ ఉండ‌వు. స‌మీపంలోని ప్ర‌జ‌లు నిత్యం వెళ్లి వ‌స్తూనే ఉంటారు. అయితే.. ద‌గ్గ‌రి ప్రాంతాల్లోని వారే కాకుండా.. ఇండియాలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన వారు కూడా కొవిడ్ వ్యాక్సిన్ కోసం నేపాల్ వెళ్తున్నార‌ట‌!

అయితే.. వాళ్లు వెళ్లేది నేపాల్ వ్యాక్సిన్ కోసం కాదు. చైనా వ్యాక్సిన్ కోస‌మ‌ట‌! అవును.. విదేశాల‌కు చెందిన వారు ఎవ‌రైనా చైనాలో అడుగు పెట్టాలంటే.. త‌మ‌ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేన‌ని ష‌ర‌తు విధించిది చైనా. కానీ.. చైనా వ్యాక్సిన్ భార‌త్ లో అందుబాటులో లేదు. అందువ‌ల్ల చాలా మంది నేపాల్ వెళ్లి ఆ వ్యాక్సిన్ తీసుకుంటున్నార‌ట‌.

అంత అవ‌స‌రం వారికి ఏమొచ్చిందంటే.. ఇండియాలోని చాలా మందికి చైనాలో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. అంతేకాదు.. చాలా మంది భార‌తీయులు చైనాలో చ‌దువుకుంటున్నారు. వీరితోపాటు ఆదేశంలో ఇత‌ర‌త్రా అవ‌స‌రాలు ఉన్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి నేపాల్ వెళ్తున్నార‌ట‌. ఈ మేర‌కు అంత‌ర్జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News