అమరావతికి ఫోర్స్డ్ బ్యాచులర్స్ జోరు

Update: 2016-07-23 06:38 GMT
ఏపీ సచివాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ఉండటం.. ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వని నేపథ్యంలో చిన్నాచితకా అధికారి నుంచి అత్యున్నత అధికారులంతా ఒకట్రెండు రోజులు అటూఇటూగా అమరావతి పయనమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా అమరావతి వెళ్లే ఐఏఎస్.. ఐపీఎస్.. ఐఎఫ్ ఎస్ అధికారుల్లో ఎక్కువ మంది ఫోర్సెడ్ బ్యాచులర్స్ అవతారం ఎత్తుతున్నారు. ఇప్పటికిప్పుడు అమరావతి షిఫ్ట్ అయ్యేందుకు ఇబ్బందులు ఉండటం.. ఫ్యామిలీలతో పాటు పిల్లల చదువులు సైతం అడ్డంకిగా మారటంతో.. కుటుంబాన్ని హైదరాబాద్ వదిలేసి.. అమరావతికి ఒంటరిగా బయలుదేరుతున్నారు.

వీరికి అవసరమైన వసతులు కల్పించే విషయంలో తామంతా ఫోర్సెడ్ బ్యాచులర్స్ గా ఉండాలని డిసైడ్ అయ్యామని.. తమకు ఆ మేరకు అమరావతిలో వసతి కల్పిస్తే చాలన్న మాటను వారు ఏపీ ప్రభుత్వానికి చెబుతున్నారు. ఇలా చెప్పే వారి సంఖ్య పది మందో ఇరవై మందో కాకుండా.. లెక్కలోకి తీసుకోవాల్సిన మేరకు ఉండటం గమనార్హం. దీంతో.. వారికి కేటాయించాల్సిన డబుల్ బెడ్రూం ఇళ్లను.. మార్చి వారి అవసరాలకు తగ్గట్లుగా మార్చి.. సదుపాయాలు కుదించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఇదిలా ఉంటే.. ఇలాంటి అధికారుల వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బ తినే అవకాశం ఉంది చెబుతున్నారు. ఎందుకంటే.. వారానికి రెండు రోజులు అధికారికంగా సెలవులు ఉండటం.. ప్రతి వారం కాకున్నా.. రెండు.. మూడు వారాల్లో ఒకట్రెండు సార్లు ఫ్యామిలీ అవసరాల కోసం హైదరాబాద్ కు వెళ్లిపోవటం.. వీటన్నింటికి తోడు ఏదైనా వారంలో మధ్యలో రెండు సెలవులు వస్తే.. మొత్తంగా సెలవులు పెట్టేసుకునే ప్రమాదం ఉందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే పనులు ఆలస్యం కావటమే కాదు.. ఉన్నతాధికారులు అందుబాటులో ఉండకుండా పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫోర్స్ డ్ బ్యాచులర్ అధికారుల కారణంగా ఏపీప్రభుత్వ పని తీరుపై ప్రభావం తప్పనిసరిగా పడుతుందంటున్నారు.
Tags:    

Similar News