మోజో టీవీ సీఈవో రేవ‌తి అరెస్టా? అదుపులోనా?

Update: 2019-07-12 09:57 GMT
ర‌విప్ర‌కాశ్ మాన‌స‌పుత్రిక మోజో టీవీ గురించి తెలిసిందే.  ఈ సంస్థ‌కు సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు రేవ‌తి. తాజాగా ఆమెను ఆమె నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆమెపై ఎస్సీ..ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదై ఉంది. ఇంత‌కీ ఆ కేసు ఆమెపై ఎందుకు న‌మోదైంది?  ఎవ‌రు ఫిర్యాదు చేశార‌న్న‌ది చూస్తే.. ద‌ళిత నాయ‌కుడు ప్ర‌సాద్ చేసిన ఫిర్యాదుతో ఆమెపై కేసు న‌మోదు చేశారు.

త‌న‌ను రేవ‌తి అవ‌మానించార‌ని.. కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమెపైనా.. మోజో స్టూడియోకు చెందిన ర‌ఘుపైనా కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసుకు సంబంధించిన ఇప్ప‌టికే రేవ‌తికి నోటీసులు ఇచ్చార‌ని.. అయినా ఆమె స్పందించ‌ని కార‌ణంగానే ఆమెను అదుపులోకి తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. షేర్ల‌ను బ‌ద‌లాయించాలంటూ త‌న‌ను వేధింపుల‌కు గురి చేస్తున్న‌ట్లుగా రేవ‌తి గ‌తంలో ఆరోపించారు. త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కూ దీక్ష విర‌మించ‌నంటూ ఆమె మోజో టీవీ ప్రధాన కార్యాయ‌లంలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగి సంచ‌ల‌నం సృష్టించారు.అనంత‌రం ఆమె దీక్ష‌ను విర‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. త‌న‌కు ఎలాంటి ప‌త్రాలు చూపించ‌కుండానే ఈ రోజు ఉదయం త‌న ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చిన బంజారాహిల్స్ పోలీసులు త‌న‌ను అదుపులోకి తీసుకున్నార‌ని ఆమె ట్వీట్ లో ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా అదుపులోకి తీసుకోవ‌టానికి సంబంధించిన ప‌త్రాలు అడిగితే చూపించ‌లేద‌ని.. త‌న ఫోన్ కూడా తీసేసుకున్న‌ట్లుగా ఆమె ఆరోపించారు. ప్ర‌స్తుతం ఆమెను బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించారు. ఆమెపై న‌మోదైన కేసులో రేవ‌తి ఏ2 కాగా.. ఏ1 ర‌ఘుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంద‌ని.. అరెస్ట్ పై పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కూ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు.
Tags:    

Similar News