కాంగ్రెస్ లో చేర‌నున్న మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్!

Update: 2022-06-25 05:30 GMT
ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్​ కాంగ్రెస్​లో చేరడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఆయ‌న తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సమ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఆయ‌న‌ ఏడాదిన్నర కిందటే ఆ పార్టీకి గుడ్​బై చెప్పి కాంగ్రెస్​లో చేర‌డానికి ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌మంలో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డిని కలిశారు. చేరిక‌ల‌కు సంబంధించి త‌న అనుచ‌రుల‌ను కూడా రెడీగా ఉంచుకున్నారు. అయితే ఈ విష‌యం తెలిసిన బీజేపీ నేత‌లు ఎర్ర శేఖ‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఆయ‌న‌ను బ‌తిమ‌లాడ‌టంతో అప్ప‌ట్లో కాంగ్రెస్ లో చేర‌కుండా ఆగిపోయారు. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక‌లు పెర‌గ‌డంతో మ‌రోసారి ఎర్ర శేఖ‌ర్ కాంగ్రెస్ లోని చేరాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

కాగా జడ్చర్ల నియోజకవర్గంలో బాలానగర్, రాజాపూర్, నవాబ్​పేట, జడ్చర్ల, మిడ్జిల్​ మండలాలు ఉన్నాయి. 2,02,362 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 40 శాతం మంది ఓటర్లు బీసీలే. ఎర్రశేఖర్ కూడా బీసీ సామాజికవర్గానికి చెందినవారే. దీంతో ఆయనను కాంగ్రెస్​లో చేర్చుకుంటే ఆ వర్గానికి చెందిన ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవ‌చ్చ‌ని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎర్రశేఖర్​ ఆ పార్టీలో చేరిన వెంటనే, నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

మ‌రోవైపు జడ్చర్ల లో కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌స్తుతం జనుంపల్లి అనిరుధ్​రెడ్డి కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే ద‌క్కుతుంద‌నే ఆశ‌తో ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మండలాల్లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతిస్తున్నారు. ప్రత్యక్షంగా పాల్గొంటూ, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎర్రశేఖర్​ కాంగ్రెస్​లో చేరితే, పరిస్థితి ఏంటనే దానిపై కేడర్ చర్చించుకుంటోంది. కాగా, ఎర్రశేఖర్​ గతంలో జడ్చర్ల ఎమ్మెల్యేగా పని చేశారు.

అయితే, ఎర్రశేఖర్​ను పాలమూరు నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్​ భావిస్తున్నట్టు కొందరు సీనియర్​ నాయ‌కులు చెబుతున్నారు. అలా కుదరకపోతే ఎర్ర శేఖర్​ సొంత నియోజకవర్గమైన దేవరకద్ర నుంచి కూడా టికెట్​ ఇచ్చే చాన్సు ఉంద‌ని అంటున్నారు. అయితే, జడ్చర్ల నుంచే అనిరుధ్​రెడ్డి, ఎర్రశేఖర్​ టికెట్ల కోసం పట్టుబడితే.. ఎలాంటి పరిణామాలు ఉంటాయ‌న్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News