ప‌రువు పోగొట్టుకున్న సీఎం ఏపీ ఇన్‌ఛార్జి !

Update: 2018-05-27 10:49 GMT
తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన స్వ‌రాష్ట్రం ఇచ్చిన‌ప్ప‌టికీ 2014 సార్వత్రిక ఎన్నిక‌లు మొద‌లుకొని అనంత‌రం జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఘోర ప‌రాజ‌యం పాలవుతున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ కొద్దికాలంగా త‌న ఉనికిని చాటుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంలో ఆ పార్టీ నేత‌లు ఉద్య‌మించ‌డం ద్వారా తెర‌మీద‌కు వ‌స్తున్నారు. అయితే అలాంటి పార్టీకి జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ కొత్త క‌బురు అందించారు. రాష్ట్రానికి  కొత్త ఇంచార్జీని నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఆయ‌న వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న ఉన్న వ్య‌క్తి కావ‌డం కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేక‌పోతున్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇప్పటి వరకు ఇంచార్జీగా ఉన్న సీనియ‌ర్ నేత‌ దిగ్విజయ్ సింగ్‌ను ఆ ప‌ద‌వి నుంచి తొలగించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్  ఇంచార్జిగా ఊమెన్ చాండీ నియ‌మించారు. దీంతో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది.  

రాజ‌కీయ‌వ‌ర్గాల అంచనాల ప్ర‌కారం ఆంధ్ర‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జ‌వ‌స‌త్వాలు కూడ‌గ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. పార్టీకి పున‌రుజ్జీవం క‌ల్పించేందుకు త్వ‌ర‌లో కొత్త ఇంచార్జీని ప్ర‌క‌టిస్తార‌ని కొద్దికాలంగా వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుత ఇంచార్జీ దిగ్విజ‌య్ సింగ్ కు ఆ బాధ్య‌త‌ల‌పై ఆస‌క్తి లేక‌పోవ‌డంతో పాటుగా కాంగ్రెస్ సైతం ఆయ‌న ప‌నితీరుపై అసంతృప్తితో ఉంద‌ని అంటున్నారు. అయితే డిగ్గీరాజాను త‌ప్పిస్తే ఎవ‌రిని నియ‌మించాల‌నే క్ర‌మంలో రెండు పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. గ‌తంలో ఇంచార్జీ బాధ్య‌త‌లు నిర్వ‌హించిన గులాంన‌బీ ఆజాద్ తో పాటు కేర‌ళ మాజీ సీఎం ఉమెన్ చాండీ పేర్లు వినిపించాయి. అయితే గులాం న‌బీ ఆజాద్ ఇంచార్జీగా ఉంటే ``ఒక వ‌ర్గం`` వారికే ప్రాధాన్యత ఇస్తార‌ని గ‌తంలో ఈ విధంగా కొంద‌రిని అనూహ్య రీతిలో పైకి తీసుకువెళ్లార‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు అభ్యంత‌రం తెలిపారు. దీంతో దాదాపు కొలిక్కి వచ్చిన ఆయ‌న ఎంపిక చివ‌రి నిమిషంలో వెన‌క్కు పోయింది. దీంతో ఉమెన్ చాండీ పేరును ఖ‌రారు చేశారు.

అయితే ఆయ‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. చాండీ కేర‌ళ సీఎంగా ఉన్న స‌మ‌యంలో అవినీతి కుంభ‌కోణాల్లో కూరుకుపోవ‌డం, ఓ మ‌హిళ‌ను వేధించిన ఆరోప‌ణ‌లు ర‌చ్చ‌రచ్చ‌గా మారిన సంగ‌తి తెలిసిందే. కేర‌ళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో సోలార్ కుంభ‌కోణం తెర‌మీద‌కు వ‌చ్చింది. సుమారు 70 కోట్ల సోలార్ కుంభకోణానికి సంబంధించి 13 మంది రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ స్కాం కార‌ణంగానే చాండీ ఓడిపోయార‌నే చ‌ర్చ కూడా ఉంది. ఈ క్ర‌మంలో సరితా నాయర్ అనే ఓ మ‌హిళ దాఖ‌లు చేసిన చీటింగ్ కేసు ఫిర్యాదు వివాదాస్పదంగా మారింది. కోయంబత్తూరు కోర్టుకు విచార‌ణ‌కు హాజ‌ర‌యిన సంద‌ర్భంగా స‌రితా మీడియాతో మాట్లాడుతూ సీఎంపై ఆరోప‌ణలు చేశారు. సీఎం, ఆర్థిక మంత్రితో పాటు మ‌రో ముగ్గురు త‌న‌ను వేధించార‌ని మీడియాతో స‌రిత పేర్కొంది. కేరళ మాజీ ఆర్థిక మంత్రి పళని మాణిక్యంపై లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డార‌ని, ఓ ఐటీ కేసులో మాణిక్యం లంచం డిమాండ్ చేయ‌డ‌మే కాకుండా తనను లైంగికంగా వేధించారన్నారు. ఇలా తీవ్ర వివాదాస్ప‌ద‌మైన నాయ‌కుడిని ఇంచార్జీగా వేయ‌డం ఏంట‌ని కాంగ్రెస్ నాయ‌కులే చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News