రాజ్య‌స‌భ రేసులో ఆ రెడ్డిగారు, ఎన్నాళ్ల‌కెన్నాళ‌కూ!

Update: 2020-02-24 23:30 GMT
సురేష్ రెడ్డి.. తెలుగు రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు ఈ పేరు బాగా వినిపించింది. అయితే ఆ త‌ర్వాత సురేష్ రెడ్డి మ‌ళ్లీ వెల‌గ‌లేక‌పోతూ ఉన్నారు! 2004లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బంప‌ర్ మెజారిటీతో అధికారం సంపాదించుకున్న స‌మ‌యంలో సురేష్ రెడ్డిని అసెంబ్లీ స్పీక‌ర్ ను చేసుకుంది ఆ పార్టీ. చ‌క్క‌ని మాట తీరు, శాంతంగా స్పందించ‌డం ద్వారా సురేష్ రెడ్డి అప్ప‌ట్లో స్పీక‌ర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ లో ఉద్ధండులు ఉన్నా.. వారంద‌రి మ‌ధ్య‌నా సురేష్ రెడ్డి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. అయితే ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మ‌రోసారి గెల‌వ‌లేక‌పోయారు.

2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సురేష్ రెడ్డి ఓట‌మి పాల‌య్యారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ అధికారాన్ని సంపాదించుకుంది. దీంతో సురేష్ రెడ్డి ఉనికి అప్పుడ‌ప్పుడైనా ఉండేది. ఇక కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాకా సురేష్ రెడ్డి కి ఉనికి ఇబ్బందులు లేకుండా పోయాయి. కిర‌ణ్ తో సురేష్ రెడ్డి కి మంచి సాన్నిహిత్య‌మే ఉండేది అప్ప‌ట్లో! ఇక తెలంగాణ‌ ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత కూడా సురేష్ రెడ్డి రాజ‌కీయంగా రాణించ‌ లేక‌పోయారు.

కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త కూడా ల‌భించ‌లేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరారు. కాంగ్రెస్ నుంచి వ‌చ్చే వారికి కేసీఆర్ మంచి ప్రాధాన్య‌త‌ను ఇస్తూ ఉంటారు. అందుకే సురేష్ రెడ్డికి అప్ప‌ట్లో గ్రాండ్ వెల్క‌మ్ ల‌భించింది. ఇప్పుడు ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌ట‌మే మరింత ఆస‌క్తిదాయ‌కం.

తెలంగాణ అసెంబ్లీ కోటాలో రెండు రాజ్య‌స‌భ సీట్లు టీఆర్ఎస్ కు ద‌క్క‌నున్నాయనే సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి. ఇప్పుడు అందులో సురేష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా సురేష్ రెడ్డి వీళ్లిద్ద‌రి లో ఒక‌రికి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఇద్ద‌రూ రెడ్ల‌కు ద‌క్కే అవ‌కాశాలు ఉండ‌వు. అందునా కేసీఆర్ కూతురు క‌విత కూడా రేసులో ఉన్న‌ట్టే. ఇలాంటి నేప‌థ్యం లో వీళ్లిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రికి రాజ్య‌స‌భ సీటు ద‌క్కవ‌చ్చ‌ని ఒక ప్ర‌చారం సాగుతూ ఉంది. మ‌రి సురేష్ రెడ్డికే ఆ అవ‌కాశం ద‌క్కితే చాలా కాలం త‌ర్వాత ఆయ‌న‌కు చ‌ట్ట‌స‌భ‌లో స్థానం ల‌భించిన‌ట్టుగా అవుతుంది!
Tags:    

Similar News