నలుగురు మినహా అందరూ దారిలోకొచ్చారు

Update: 2018-11-23 10:48 GMT
మొత్తానికి మహాకూటమికి రెబల్స్ బాధ చాలా వరకు తగ్గినట్లే కనిపిస్తోంది. టికెట్లు రాని అసంతృప్తులు స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో కూటమిలోని పార్టీల ప్రధాన నేతలు వెంటనే రంగంలోకి దిగారు. రెండు రోజుల పాటు గట్టి ప్రయత్నాలు చేసి చాలా వరకు రెబల్స్‌ ను దారిలోకి తెచ్చుకున్నారు. స్వతంత్రులుగా బరిలో నిలిచిన తిరుగుబాటు అభ్యరుల్లో నలుగురు మినహా మిగతావారికి నచ్చజెప్పగలిగారు. వాళ్లందరూ గురువారం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇతర పార్టీల నుంచి బరిలోకి దిగిన 8 మంది మాత్రం పోటీలో కొనసాగుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా కనిపించింది. దీంతో బుధ గురువారాల్లో ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌ పటేల్‌.. కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేష్‌.. జైపాల్‌ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. ఏఐసీసీ ఇన్ ఛార్జి కుంతియా తదితరులు రంగంలోకి దిగారు. అసంతృప్తులకు నచ్చజెప్పారు. వారికి భవిష్యత్తులో అవకాశాలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రెబల్స్ వెనక్కి తగ్గారు. పార్టీ అభ్యర్థులకు సహకరించడానికి అంగీకరించారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థులు నాలుగు స్థానాల్లో మాత్రం స్వతంత్రులుగా కొనసాగుతున్నారు. తుంగతుర్తి నుంచి వడ్డేపల్లి రవి.. బోథ్‌ నుంచి అనిల్‌ జాదవ్‌.. వైరా నుంచి రాములునాయక్‌.. మహబూబ్‌ నగర్‌ నుంచి ఇబ్రహీం స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అలాగే టికెట్లు దక్కని కొందరు ఇతర పార్టీల తరఫున నామినేషన్లు వేశారు. వీరు బరిలో కొనసాగుతున్నారు. ఖానాపూర్‌ లో హరినాయక్‌.. నారాయణపేటలో శివకుమార్‌ రెడ్డి.. ఇబ్రహీంపట్నంలో మల్‌ రెడ్డి రంగారెడ్డి.. చెన్నూరులో బోడ జనార్దన్‌.. మహబూబ్‌ నగర్‌లో సురేందర్‌ రెడ్డి.. ముథోల్‌ లో నారాయణరావు పటేల్‌ - సిర్పూరులో రావి శ్రీనివాస్‌ - దేవరకొండలో బిల్యానాయక్‌ ఇతర పార్టీల తరఫున పోటీలో ఉన్నారు.

నామినేషన్లు వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్లే..

అమరేందర్‌ రెడ్డి (మిర్యాలగూడ).. నాయిని రాజేందర్‌ రెడ్డి (వరంగల్‌ పశ్చిమ).. విజయరామారావు (స్టేషన్‌ ఘన్‌ పూర్‌).. సున్నం నాగమణి (అశ్వారావుపేట).. పడాల వెంకటస్వామి (చేవెళ్ల).. కొలను బాల్‌ రెడ్డి.. సఫాన్‌ దేవ్‌.. శశికళ.. అంజిరెడ్డి (పటాన్‌ చెరు).. మాల్యాద్రిరెడ్డి (బాన్సువాడ).. సుభాష్‌ రెడ్డి (ఎల్లారెడ్డి).. తోటకూర జంగయ్య యాదవ్‌ (మేడ్చల్‌).. కొమ్మిరెడ్డి జ్యోతి (మెట్‌ పల్లి).. జి.మధుసూదన్‌ రెడ్డి (దేవరకద్ర).. పటేల్‌ రమేష్‌ రెడ్డి (సూర్యాపేట).. రోహిణ్‌ రెడ్డి (ఖైరతాబాద్‌).. భిక్షపతి యాదవ్ (శేరిలింగంపల్లి).. కొండేటి శ్రీధర్‌ (వర్ధన్నపేట).


Tags:    

Similar News