బ్యాంక్ డిపాజిట్లు కొల్ల‌గొట్టం..అబ‌ద్దం...జైట్లీ

Update: 2017-12-13 05:39 GMT
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్‌ ఆర్‌ డీఐ) బిల్లును అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లును అమల్లోకి తీసుకురావాలన్న విషయంలో ప్రభుత్వం ముందుకు సాగాలని నిశ్చయించుకున్నట్లయితే తాము సమ్మెకు దిగాలని యోచిస్తున్నట్లు ఏఐబీఈఏ స్పష్టం చేసింది. బ్యాంకులను నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఈ బిల్లు లో పొందుపర్చిన బెయిల్ ఇన్ క్లాజు బ్యాంకు డిపాజిటర్లకు తీవ్ర నష్టాన్ని చేకూర్చేదిగా ఉందని, ఈ నిబంధన గనుక అమల్లోకి వస్తే డిపాజిటర్ల సొమ్ము ను బ్యాంకులు తిరిగి చెల్లించబోవని ఏఐబీఈఏ ఆందోళన వ్యక్తం చేసింది.

బ్యాంకులు - బీమా తదితర ఆర్థిక సంస్థల దివాలా సమస్యలను పరిష్కరించేందుకు కొత్తగా ఫైనాన్షియల్ రిజల్యూషన్ కార్పొరేషన్ (ఎఫ్‌ ఆర్‌ సీ)ను ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలుకల్పిస్తోందని, ఈ బిల్లు గనుక అమల్లోకి వస్తే.. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)తో పాటు ప్రస్తుతం ఇటువంటి సమస్యలను పరిష్కరిస్తున్న ఇతర సంస్థల అధికారాలను ఎఫ్‌ ఆర్‌ సీ హస్తగతం చేసుకుంటుందని ఏఐబీఈఏ పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఖాతాదారులు దాచుకున్న సొమ్ములో లక్ష రూపాయల మేర డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గ్యారంటీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎఫ్‌ ఆర్‌ సీ గనుక ఏర్పడితే ఎంత మొత్తానికి గ్యారంటీ ఇవ్వాలన్న విషయాన్ని ఎఫ్‌ ఆర్‌ సీ నిర్ణయించడమే కాకుండా అసలు ఈ గ్యారంటీకి పూర్తిగా స్వస్తి పలికే అవకాశాలు కూడా లేకపోలేదని ఏఐబీఈఏ స్పష్టం చేసింది. ఏ బ్యాంకునైనా మూసివేయించే అధికారాన్ని కలిగివుండే ఎఫ్‌ ఆర్‌ సీ.. మొండి బకాయిల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకులు ఆ సమస్య నుంచి బయటపడేందుకు (బెయిల్ ఇన్) డిపాజిటర్ల సొమ్మును ఉపయోగించుకునేలా అనుమతిచ్చేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోందని, ఈ నిబంధనే ఇప్పుడు అందరిలో సందేహాలను - భయాందోళనలను కలిగిస్తోందని ఏఐబీఈఏ ఒక ప్రకటనలో పేర్కొంది.

బ్యాంకుల్లోని ప్రజల డిపాజిట్లకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం అభయమిచ్చారు. ప్రతిపాదిత ఎఫ్‌ ఆర్‌ డీఐ (ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్) బిల్లులో మార్పులు - చేర్పులు చేసేందుకు సుముఖంగా ఉన్నామని, కనుక ఈ ముసాయిదా బిల్లులోని నిబంధనల గురించి ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రూ.2.11 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూర్చడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికను ప్రకటించిందని, కనుక ప్రజలు దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు విఫలమయ్యే ప్రశ్నే ఉండదని, ఒకవేళ అటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పటికీ బ్యాంకు ఖాతాదారుల డిపాజిట్లకు ప్రభుత్వం సంపూర్ణ భద్రత కల్పిస్తుందని ఆయన ప్రకటించారు.

ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులోని కొన్ని నిబంధనల పట్ల బ్యాంకు డిపాజిటర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు ఆయన ఈ ప్రకటన చేశారు. గత ఏడాది లోక్‌ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రస్తుతం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలిస్తున్నది. ఈ ముసాయిదా బిల్లులో పొందుపర్చిన బెయిల్ ఇన్ క్లాజు వలన బ్యాంకు పొదుపు ఖాతాల్లోని డిపాజిట్లకు హాని కలిగే అవకాశం ఉందని కొంత మంది నిపుణులు అంటున్నారు. అయితే ఈ బిల్లుకు సంబంధించి జేపీసీ ఎటువంటి సిఫారసులు చేసినా వాటిని ప్రభుత్వం పరిశీలిస్తుందని జైట్లీ తెలిపారు. ఈ బిల్లులోని నిబంధనల గురించి కొంతమంది వదంతులను వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News