క్వార్టర్ బాటిల్ లో కప్ప ..షాక్ లో మందుబాబులు!

Update: 2020-05-11 08:32 GMT
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ నుండి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన సడలింపులతో చాలా రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరిచాయి. దీంతో దాదాపు 45 రోజుల పాటు చుక్క లేక విలవిల్లాడిన మందుబాబులు ఇక పండగ చేసుకుంటున్నారు. తమిళనాడులో ఒక్కరోజులోనే రూ.150కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో మొదటిరోజే రూ.90కోట్లు,ఆంధ్రప్రదేశ్‌ లో రూ.40కోట్లు పైచిలుకు విక్రయాలు జరిగాయి. లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చిన తరువాత మద్యం దుకాణాలు తెరచి వారం రోజులు  కావస్తున్నా... మద్యం దుకాణాల వద్ద అదే రద్దీ కనిపిస్తోంది.

అయితే తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఓ ఘటన మందుబాబులను షాక్ తినేలా చేసింది. మైలాదుత్తురై జిల్లాలోని శీర్గాళిలో ఉన్న ఐసాని వీధిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టాస్మాక్ వైన్ షాపు ఉంది. ఆదివారం ఓ వ్యక్తి ఆ షాపుకు వెళ్లి క్వార్టర్ రమ్ బాటిల్ కొనుగోలు చేశాడు. అనంతరం పొలం గట్టుకు వద్దకు వెళ్లి, అక్కడే కూర్చొని దాన్ని ఓపెన్ చేశాడు. గ్లాసులో ఒక పెగ్ పోసుకుని, తిరిగి బాటిల్ మూత పెట్టే క్రమంలో అందులో ఉన్నది చూసి షాక్ తిన్నాడు. ఆశ్చర్యంగా అందులో అతనికి ఓ చనిపోయిన కప్ప కనిపించింది.

మద్యం సీసాలో కప్ప ఎలా వచ్చిందో అతనికి అంతుచిక్కలేదు. ఈలోగా అతని మిత్రులకు విషయం చెప్పడంతో.. అది టాస్మాక్ యాజమాన్యం దాకా వెళ్లింది. విషయం బయటకు పొక్కకుండా సదరు వ్యక్తి నుంచి ఆ బాటిల్ ‌ను టాస్మాక్ యాజమాన్యం తిరిగి తెప్పించుకుంది. దానికి బదులు మరో క్వార్టర్ బాటిల్‌ ను కూడా అతనికి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈలోపే కొంతమంది ఆ బాటిల్‌ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

అయితే, మరోవైపు తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో మద్యం దుకాణాల వద్ద రద్దీపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భౌతిక దూరం పాటించకుండా జరుపుతున్న కొనుగోళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం నిత్యావసర వస్తువేమీ కాదు కాబట్టి..మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది. అత్యవసరం అని భావిస్తే ..ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది.
Tags:    

Similar News