డీకే అరుణ ఎమ్మెల్యేగా అక్క‌డి నుంచి!

Update: 2022-01-31 07:38 GMT
తెలంగాణలో రాజ‌కీయ సంద‌డి ఊపందుకుంది. 2014లో ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి తెలంగాణ‌లో తిరుగులేని పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌కు ఇప్పుడు స‌వాలు ఎదుర‌వుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌.. అధికార టీఆర్ఎస్‌కు సీఎం కేసీఆర్‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారాయి. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయ త్రిముఖ పోరుగా మారింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న విప‌క్షాలు ఇప్ప‌టి నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టాయి. తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి ఇప్ప‌టి నుంచే ఆయా పార్టీల నేత‌లు తాము పోటీ చేసే స్థానాల‌ను ఎంపిక చేసుకోవ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యార‌నే టాక్ వినిపిస్తోంది.

వ‌న‌ప‌ర్తి పై మొగ్గు..
2018లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్ రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చారు. ఈ ప్ర‌కారం అయిదేళ్లు ముగిశాక అంటే 2023లో మ‌రోసారి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంటుంది. కానీ మ‌రోసారి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది కాబ‌ట్టి ఎన్నిక‌లు అంత‌కంటే ముందే వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. ఈ నేప‌థ్యంలో నేత‌లు తాము పోటీ చేసే స్థానాల‌పై దృష్టి పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి బీజేపీ మ‌హిళా నేత డీకే అరుణ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

అక్క‌డే మొద‌లు..
త‌న రాజ‌కీయ జీవితంలో మొద‌టి నుంచి గ‌ద్వాల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన డీకే అరుణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. 1999లో తొలిసార గ‌ద్వాల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2004లో స‌మాజ్‌వాదీ పార్టీ త‌ర‌పున 2009, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గ‌త ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత బీజేపీలో చేరి 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి బ‌రిలో దిగినా నిరాశ త‌ప్ప‌లేదు.  ప్ర‌స్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాలనే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఓ వైపు రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోంది.

ఆ గుర్తింపు కోసం..
రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటున్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తిలో గెలిచి అధిష్ఠానం దృష్టిలో ప‌డాల‌ని డీకే అరుణ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.  అక్క‌డ టీఆర్ఎస్ నుంచి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థి చిన్నారెడ్డిపై గెలిచి కేసీఆర్ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్నారు. ఈ నేప‌థ్యంలో నిరంజ‌న్‌రెడ్డిపై పోటీకి దిగి విజ‌యం సాధిస్తే పార్టీలో ఎక్కువ ప్రాధాన్య‌త ల‌భిస్తుంద‌ని అరుణ అనుకుంటున్నార‌ని తెలుస్తోంది. అందుకే తాను వ‌న‌ప‌ర్తిలోనే పోటీకి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు గ‌ద్వాల్ నుంచి త‌న కుమార్తెను నిల‌బెట్టాల‌ని ఆమె చూస్తున్నార‌ని టాక్. మ‌రి ఆమె నిర్ణ‌యానికి అధిష్ఠానం నుంచి అంగీకారం వ‌చ్చిందో లేదో ఇంకా తెలీదు. మ‌రి హైక‌మాండ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News

ఇక ఈడీ వంతు